‘చదువుకుంటూ చట్టబద్ధంగా ఉద్యోగం చేస్తున్న వారే లాక్‌డౌన్ తర్వాత దేశంలో ఉండాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన వారు లాక్‌డౌన్ ముగియగానే స్వదేశాలకు వెళ్లాలని ఆదేశించింది. లాక్‌డౌన్ వల్ల ప్రస్తుతం సూపర్ మార్కెట్లు, గ్యాస్ స్టేషన్లలో పని చేస్తున్న వారికే ఉపాధి ఉంది. మిగిలిన వారు ఖాళీ. అలాంటి వారికి మేం నిత్యావసర వస్తువులను ఉచితంగా అందిస్తున్నాం. ఇక్కడ కరోనా వ్యాప్తి కొంత నియంత్రణలో ఉంది. లాక్‌డౌన్ ఎక్కువ కాలం కొనసాగేలా ఉంది. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 1.20 లక్షల మంది ఉంటారు. వీరిలో ఎక్కువ మంది హాస్పిటాలిటీ రంగంలో చిరుద్యోగాలు చేస్తారు. ఆ రంగం పూర్తిగా మూతపడటంతో ఇబ్బందులు ఎక్కువయ్యాయి.
హై కమిషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి
‘అంతర్జాతీయ విమానాలు పునరుద్ధరించిన తరువాత విదేశీ విద్యార్థులు మాతృదేశాలకు వెళ్లిపోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితులు కుదుటపడిన తరువాత మళ్లీ అనుమతిస్తామని తెలిపింది. ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన విదేశీయులకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. మన విద్యార్థులను ఆదుకునేందుకు భారత హైకమిషన్ కార్యాలయాన్ని సంప్రదించగా, సానుకూలంగా స్పందించింది. సహాయం కావాల్సిన వారు https://www.hcicanberra.gov.in/register వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కోరింది. ఇక్కడ చదువుకుంటూ చట్టబద్ధంగా ఏడాది, అంతకు మించిన కాలం నుంచి ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులు సూపర్ యాన్యుయేషన్ వినియోగించుకునేందుకు ప్రభుత్వంఅనుమతించింది. ఇక్కడ నిత్యావసర వస్తువులకు కొరత లేదు. కానీ సూపర్‌మార్కెట్లలోకి పదేసి మంది చొప్పున మాత్రమే అనుమతిస్తుండడంతో కొంత సమయం పడుతోంది’ అని శివనాథ్‌రెడ్డి వివరించారు.