తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ఏనుగే మళ్లీ వచ్చింది... ఆ 'అమ్మ'ను చంపింది! - that-elephant-came-again-and-killed-the-cow

కదల్లేకుండా పడి ఉన్న ఆ తల్లిని చూసి ఆ మదపుటేనుగుకు కనికరం కలగలేదు. కనీసం పచ్చిక తినడం కూడా నేర్వని దూడను చూసైనా జాలేయలేదేమో... పదిహేను రోజుల ముందు దాడి చేసిన ఏనుగే తిరుగొచ్చి మరీ దాడి చేసి ఆ గోవును చంపేసింది. కళ్లెదుటే కన్నతల్లిని క్రూరంగా చిదిమేస్తుంటే ఆ దూడ అమాయకంగా దిక్కులు చూస్తూ ఉండిపోయింది.

ఆ ఏనుగే మళ్లీ వచ్చింది... ఆ 'అమ్మ'ను చంపింది!

By

Published : Sep 17, 2019, 4:04 PM IST

నడుం విరిగి కదల్లేకున్నా... అమ్మదనానికి నిలువెత్తు నిదర్శనంగా దూడకు పాలిస్తూ, కడుపు నింపుతున్న ఆవు పాలిట ఆ మదపుటేనుగు మృత్యువైంది. పదిహేను రోజుల కిందట గోవు నడుంపై తొండంతో ఎముకలు విరగ్గొట్టిన ఏనుగు... పగబట్టినట్లుగా ఆదివారం రాత్రి మళ్లీ వచ్చింది. తప్పించుకునే స్థితిలో లేని ఆవుపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగవరం మండలం గాంధీనగర్‌లో చోటు చేసుకుంది. ఆవు కదలలేని స్థితిలో ఉన్నా దూడకు పాలిస్తున్న వైనంపై ‘'అమ్మ... కన్నీటి చెమ్మయింది'’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఆవు దయనీయ పరిస్థితిని చూసి పలువురు పాఠకులు స్పందించారు. తాము సహాయం చేస్తామంటూ ‘ఈనాడు- ఈటీవీ’ ప్రతినిధులను సంప్రదించారు. ఆవు యజమాని అయిన రైతు కృష్ణమూర్తి వివరాలు తీసుకున్నారు. ఇంతలోనే అదే ఏనుగు లేవలేని స్థితిలో ఉన్న ఆవును చంపేసి, కళేబరాన్ని కొంత దూరంలో విసిరేసింది.

ఏనుగులు పగబట్టవు

ఏనుగులు పగబట్టడం ఉండదని, ఒక్కోసారి వాటికి మదమెక్కి ఆడ ఏనుగులు కనిపించే దాకా చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటాయని పలమనేరు ఎఫ్‌ఆర్‌వో మదన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆ సమయంలో ఏ జంతువు కనిపిస్తే దానిపై దాడి చేస్తాయని వివరించారు. ఆవు కళేబరానికి పశువైద్యులు పరీక్షలు చేశారని, రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేత మేసే ఓపిక లేకున్నా... పదిహేను రోజుల నుంచి తనకు పాలిచ్చిన తల్లి నిర్జీవంగా పడి ఉండగా... దూడ అమాయకంగా దిక్కులు చూస్తూ ఉండిపోయింది. ఆవును చంపాక ఆ ఏనుగు సమీపంలో ఉన్న కృష్ణమూర్తిపై దాడికి ప్రయత్నించింది. అప్పటికే అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది దాన్ని అడవిలోకి తరిమేశారు. వెళ్లినట్లే వెళ్లిన ఏనుగు తిరిగి వచ్చి, బండమీద జరవారిపల్లెలో ఓ దూడపై దాడి చేసింది. దంతాలతో పొడవడంతో దాని కడుపులోంచి పేగులు బయటకు వచ్చేశాయి. పశువైద్యులు ఆ దూడకు చికిత్స చేసి, కుట్లు వేశారు.
ఇదీ చూడండి: బిడ్డ ఆకలి తీర్చాలని ఓ తల్లి ఆరాటం...

For All Latest Updates

TAGGED:

cow

ABOUT THE AUTHOR

...view details