'మొఘల్‌పురాలో ధ్రువ పత్రాలు లేని 55 వాహనాలు సీజ్' - 150 మంది పోలీసులు
దక్షిణ మండల డీసీపీ ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీసులు పాతబస్తీ పరిధిలో నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్లు మీర్ చౌక్ ఏసీపీ ఆనంద్ తెలిపారు. కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు ముందుకొస్తున్నారని ఏసీపీ హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ పాతబస్తీలోని మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో దక్షిణమండల డీసీపీ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు మీర్ చౌక్ ఏసీపీ ఆనంద్ తెలిపారు. తనిఖీల్లో 150 మంది పోలీసులు పాల్గొన్నారన్నారు. అనంతరం పట్టుబడ్డ 15 మంది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేశారు. సరైన ధ్రువ పత్రాలు లేని 55 వాహనాలను జప్తు చేశారు.
కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు ముందుకొస్తున్నారని ఏసీపీ హర్షం వ్యక్తం చేశారు. రానున్న బోనాల పండుగ సందర్భంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. తాము కూడా అదే రీతిలో ప్రజలకు పూర్తిగా సహకరిస్తామని వివరించారు.