తెలంగాణ

telangana

ETV Bharat / state

టెట్‌ రాస్తున్నారా.. ఈ ట్రిక్స్ ఫాలో అయితే జాబ్ పక్కా మీదే.. - టెట్‌ రాస్తున్నారా.. అయితే ఇలా ఈజీగా స్కోరు సాధించొచ్చు!

ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ జరగనున్న నేపథ్యంలో డీఎస్‌సీకి ముందు రాయాల్సిన టెట్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.టెట్‌లో అర్హత పొందడానికి ఈ పరీక్షకు ఇప్పటి నుంచే సమగ్రంగా సన్నద్ధం అవ్వటం మేలు. అందుకు ఏయే మెలకువలు పాటించాలో తెలుసుకుందాం!

tet-2022 preparation in telugu
tet-2022 preparation in telugu

By

Published : Apr 15, 2022, 9:44 AM IST

Updated : Apr 15, 2022, 9:57 AM IST

‘భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది’, ‘మిగతా అన్ని ఇతర వృత్తులనూ తయారుచేసే ఏకైక వృత్తి బోధన’ - ఈ వాక్యాలు ఉపాధ్యాయ వృత్తి గొప్పతనాన్ని అద్భుతంగా చెబుతున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం సెక్షన్‌ 23(1) నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌)లో అర్హత పొందడం తప్పనిసరి.

టెట్‌ రాయడానికి ఎవరు అర్హులో చూద్దాం.
*ఇంటర్మీడియట్‌ తర్వాత డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ పూర్తిచేసినవారు టెట్‌ పేపర్‌-1 పాసవ్వాలి.
*డిగ్రీ తర్వాత బీఈడీ చేసినవారు టెట్‌ పేపర్‌-2లో ఉత్తీర్ణత సాధించాలి.

బీఈడీ అభ్యర్థులు అర్హులేనా?
*ఎన్‌సీటీఈ దేశవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కొరత దృష్ట్యా బీఈడీ అభ్యర్థులకు పేపర్‌-1 రాయడానికి అనుమతించింది. టెట్‌ పేపర్‌-1 బీఈడీ అభ్యర్థులు రాయొచ్చు.
*టెట్‌ పరీక్షను బీఈడీ, డీఈడీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా రాయొచ్చు.
*పీజీటీ/ జేఎల్‌ అభ్యర్థులు టెట్‌ రాయవలసిన అవసరం లేదు.
*ప్రస్తుతానికి 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే ఎస్‌జీటీ టీచర్లు (ప్రైమరీ, స్కూల్‌ టీచర్లు) టెట్‌ పేపర్‌-1 రాయాలి. 6,7,8 తరగతులు బోధించే స్కూల్‌ అసిస్టెంట్లు, టీజీటీ (ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు), టెట్‌ పేపర్‌-2లో అర్హత సాధించాలి.

వెయిటేజి:టెట్‌ అర్హత పరీక్ష మాత్రమే కాదు. పోటీ పరీక్ష కూడా. ఎందుకంటే గురుకుల/ టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (డీఎస్‌సీ)లో 20 శాతం మార్కులు వెయిటేజి ఇస్తారు. కాబట్టి గతంలో టెట్‌ రాసిన అభ్యర్థులు కూడా మార్కులు పెంచుకోవడం కోసం మళ్లీ టెట్‌ రాయాలి. ఎందుకంటే టెట్లో తెచ్చుకున్న ప్రతి 15 మార్కులకూ 2 మార్కుల వెయిటేజి ఉంటుంది.

ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్‌కు జీవితకాలం చెల్లుబాటు ఉంటుంది. 2011 నుంచి టెట్‌ రాస్తోన్న అభ్యర్థులకూ, కొత్తగా టెట్‌ రాయబోయే అభ్యర్థులకూ ఈ నియమం వర్తిస్తుంది.
టెట్‌ ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్‌- రెండు భాషల్లోనూ ఉంటుంది.

సన్నద్ధతకు ఇదీ మార్గం

టెట్‌ నోటిఫికేషన్‌ తర్వాత కేవలం 60 రోజుల నుంచి 90 రోజుల సమయం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు పరీక్షకు ఇప్పటినుంచే సన్నద్ధం కావడం సముచితం.

*టెట్‌-1 రాసే అభ్యర్థులు కంటెంట్‌ 3 నుంచి 8 తరగతుల వరకు చదవాలి.
*పేపర్‌-2 రాసే అభ్యర్థులు కంటెంట్‌ 3 నుంచి 10వ తరగతి స్థాయి వరకు చదవాలి.
*టెట్‌ అభ్యర్థులు ప్రభుత్వం ముద్రించిన తెలుగు అకాడమీ పుస్తకాలు చదివి నోట్సు రాసుకోవాలి. సాధన చేయాలి.

చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి

చదివేటప్పుడు ఇందులో కీలకమైన మూడు విభాగాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి. మొదటి యూనిట్‌ శిశువికాసం. ఇందులో వికాస దశలు, వికాస సిద్ధాంతాలు, వైయక్తిక భేదాలు కన్పించే అంశాలైన ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, వైఖరులు, అభిరుచులు, సృజనాత్మకత, ఆలోచన, మూర్తిమత్వం, మానసిక ఆరోగ్యం-శిశు అధ్యయన పద్ధతులను చదవాలి.

*చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజిలో అభ్యసనం (లర్నింగ్‌) యూనిట్‌లో ప్రధాన అంశాలైన అభ్యసనా సిద్ధాంతాలు, అభ్యసన బదలాయింపు, ప్రేరణ, అభ్యసన అంగాలు, స్మృతి-విస్మృతిపై ఎక్కువగా దృష్టి పెట్టి చదవాలి.
*అధ్యాపన శాస్త్రం (పెడగాజి)లో కీలకమైన సహిత విద్య, బోధన దశలు, బోధన ఉపగమాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం (2009), జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం (2005)పై దృష్టి పెట్టి చదవాలి.

భాషలు (లాంగ్వేజెస్‌)

లాంగ్వేజ్‌-1, లాంగ్వేజ్‌-2లకు సంబంధించి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాల్లోని వ్యాకరణ అంశాలు, వాటి ఉదాహరణలు బాగా చదవాలి. సిలబస్‌లో ఇచ్చిన సాహిత్యం అవగాహన చేసుకోవాలి.

కంటెంట్‌ ఎలా చదవాలి?

తెలుగు అకాడమీ లాంటి ప్రామాణిక సంస్థల ప్రచురణలను చదువుతూ సొంతంగా నోట్సు తయారుచేసుకోవడం మంచిది.

పేపర్‌-1 అభ్యర్థులు గణితం, విజ్ఞానశాస్త్రం, సాంఘికశాస్త్రం కంటెంట్‌ను 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదవాలి. పేపర్‌-2 అభ్యర్థులు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంటెంట్‌ చదవాలి. తెలుగు అకాడమీ లాంటి ప్రామాణికమైన సంస్థల ప్రచురణలను చదువుతూ సొంతంగా నోట్సు తయారుచేసుకోవడం మంచిది.

*గణితం కంటెంట్‌లో అరిథ్‌మెటిక్‌, సంఖ్యా వ్యవస్థ, రేఖాగణితం, క్షేత్రమితి, బీజగణితం, దత్తాంశ నిర్వహణ యూనిట్లపై దృష్టి పెట్టాలి.
*సైన్స్‌ కంటెంట్‌లో సజీవ ప్రపంచం, జీవప్రక్రియలు, సహజ దృగ్విషయాలు, మన పర్యావరణం యూనిట్లు బాగా చదవాలి.
*సోషల్‌ స్టడీస్‌ కంటెంట్‌లో 6 థీమ్‌లు ఉన్నాయి. 1. భూమి వైవిధ్యం- మాన చిత్రాలు 2. ఉత్పత్తి-వినిమయం, జీవనాధారాలు 3.రాజకీయ వ్యవస్థలు-పరిపాలన 4.సామాజిక వ్యవస్థీకరణ - అసమానతలు 5.మతం-సమాజం 6. సంస్కృతి విభాగాలను అధ్యయనం చేయాలి.
*కంటెంట్‌ చదివేటప్పుడు 3, 4, 5 తరగతులకు రాసిన పాఠ్యాంశం, ఎక్కువ తరగతులు 6, 7, 8, 9, 10లో పునరావృతం అయినప్పుడు ఒకేసారి చదివి భావనలను అర్థం చేసుకోవాలి. నోట్సు రాసుకోవాలి. అంతేగానీ బట్టీ పద్ధతిలో చదవకూడదు.
*చదవటంతోపాటు పదేపదే పునశ్చరణ చేయడం, చదివింది చూడకుండా గుర్తుకు తెచ్చుకోవడం ముఖ్యం.
*కఠినమైన అంశాలను స్నేహితులు, బోధన నిపుణులతో చర్చించి అవగాహన పెంచుకోవాలి.
*గత టెట్‌ ప్రశ్నపత్రాల సాధన ద్వారా టెట్‌లో మంచి మార్కులను సాధించవచ్చు.

కెరియర్‌, ఉన్నతవిద్యలకు సంబంధించి మీకు ఏ సందేహాలుఉన్నా వాటిని మాకు పంపండి. నిపుణులు సమాధానాలు ఇస్తారు.

ఇవీ చూడండి:

Last Updated : Apr 15, 2022, 9:57 AM IST

ABOUT THE AUTHOR

...view details