హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు మహా ధర్నా నిర్వహించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిర్వహించిన ఈ ఆందోళనకు తెతెదేపా శ్రేణులు తరలివచ్చారు. పేదలు ఇళ్లు వస్తాయని ఎన్నో అశాలు పెట్టుకున్నారని.. తెరాస ప్రభుత్వం వారిని మోసం చేసిందని తెదేపా నేతలు విమర్శించారు.
రాష్ట్రం అప్పుల పాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ పేదలను ఇళ్ల పేరుతో మోసం చేస్తున్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మండిపడ్డారు. తెదేపా పేదల పక్షాన ఉన్న పార్టీ అని... వారికి ఇచ్చిన హామీలు తెరాస పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రం అప్పుల పాలవుతున్నా పేదలకు ఇళ్లు మాత్రం నిర్మించలేదన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను తెదేపా ఆదుకుందని.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తుందన్నారు.