Shaikpet Flyover Opening: హైదరాబాద్ వాసులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన నేపథ్యంలో.. నగరాన్ని 'సిగ్నల్ ఫ్రీ సిటీ'గా తీర్చిదద్దడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం- ఎస్‌ఆర్‌డీపీ కింద చేపట్టిన మరో ప్రాజెక్టు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నది. ఈ పథకం కింద రూ.333.55 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 2.8 కిలోమీటర్ల పై వంతెన నిర్మాణం పూర్తయింది. ఎస్‌ఆర్‌డీపీ ఆధ్వర్యంలో నగరంలో అతిపెద్ద షేక్‌పేట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నూతన సంవత్సర కానుకగా ఇవాళ (జనవరి 1న).. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొనున్నారు.
ట్రాఫిక్ పరిష్కారానికి 8వేల కోట్లు
KTR inaugurates Shaikpet flyover: ఆరాంఘర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లే రహదారిలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం(మిధాని- ఓవైసీ ఆస్పత్రి) మల్టీలెవల్ ఫ్లై ఓవర్ జంక్షన్‌ను మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రారంభించిన విషయం విదితమే. ఈ పథకం ద్వారా మొత్తం రూ. 8 వేల కోట్ల అంచనా వ్యయంతో 48 వివిధ రకాల అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టింది. అందులో సుమారు 2 వేల కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు తదితర 24 పనులు పూర్తయ్యాయి. మరో 24 పనులు వివిధ ప్రగతి దశల్లో ఉన్నాయి. రోడ్లు, భవనాలు శాఖ, జాతీయ రహదారుల శాఖలతో సమన్వయం చేస్తూ జీహెచ్‌ఎంసీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో షేక్‌పేట్ ఫ్లైఓవర్ 2.8 కిలోమీటర్ల కొలువుదీరింది. నగరంలో ఎస్‌ఆర్‌డీపీ ద్వారా చేపట్టిన పై వంతెనల్లో షేక్‌పేట్ ఫ్లై ఓవర్ అత్యంత పొడవైంది.