బంగాళాఖాతంలో అండమాన్ దీవుల పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో సోమవారం అక్కడే అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా. ఇది మరింత బలపడి నాలుగైదు రోజుల్లో ఉత్తరాంధ్ర తీరానికి వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి గాలులతో ఉపరితల ద్రోణి 1500 మీటర్ల ఎత్తున.. కోస్తాంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల మీదుగా అరేబియా సముద్రంపై ఉన్న మరో ఉపరితల ఆవర్తనం వరకు వ్యాపించింది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
ఆరోజు దంచికొట్టింది..
శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి(Heavy Rain in Hyderabad Yesterday) భాగ్యనగరం అతలాకుతలం అయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరి చెరువులను తలపించాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి.. రాత్రంతా అంధకారంలోనే గడిపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరూర్ నగర్ పైన ఉన్న చెరువులు అలుగు పారడంతో పలు కాలనీలన్ని వరద ముంచెత్తింది. డ్రైనేజీలు పొంగిపొర్లి కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనకు తోడు దోమలు విజృంభిస్తున్నాయని బాధిత జనం వాపోతున్నారు. రోగాలు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.