తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana income news: ఖజానాకు తగ్గిన ఆదాయం.. మొదటి ఆర్నెళ్లలో ఎంతంటే..? - తెలంగాణ వార్తలు తెలుగు

ఆదాయ అంచనాల్లో రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఆర్నెళ్లలో 30శాతం మాత్రమే అందుకొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.76 లక్షల కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా... సెప్టెంబర్ వరకు కేవలం రూ.53 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. అమ్మకం పన్ను మినహా... ఏదీ కూడా 50 శాతాన్ని సమీపించలేదు. కరోనా ప్రభావంతో పడిపోయిన ఆదాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆర్నెళ్లలో రూ.25 వేల కోట్ల రుణాలు తీసుకోగా... రూ.76 వేల కోట్ల ఖర్చు చేసింది.

Telangana income news, telangana revenue 2021
తెలంగాణ ఆదాయం, తెలంగాణ రెవెన్యూ 2021

By

Published : Oct 31, 2021, 12:02 PM IST

కరోనా రెండో దశ కారణంగా రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం బాగా తగ్గింది. భారీ అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2021-22లో రూ.1,76,126 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. సెప్టెంబర్ వరకు మొదటి ఆర్నెళ్ల కాలంలో కేవలం 30.15 శాతం మేర రూ.53,109 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ మేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌కు మొదటి ఆరు నెలల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. సెప్టెంబర్ వరకు వచ్చిన పన్ను ఆదాయం రూ.45,859 కోట్లు కాగా... పన్నేతర ఆదాయం రూ.2,436 కోట్లు, కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు రూ.4,813 కోట్లు. జీఎస్టీ ద్వారా రూ.15,108 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.4,859 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.12,815 కోట్లు సమకూరాయి. ఎక్సైజ్ ద్వారా రూ.7,308 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.3,531 కోట్లు వచ్చాయి.

అమ్మకం పన్ను టాప్

అమ్మకం పన్నులో మాత్రమే బడ్జెట్ లక్ష్యంలో 48 శాతం చేరుకొంది. ఎక్సైజ్, జీఎస్టీ అంచనాల్లో 42 శాతం, కేంద్ర పన్నుల్లో 40 శాతం లక్ష్యాన్ని చేరుకొంది. స్టాంపులు-రిజిస్ట్రేషన్లలో 38 శాతం అంచనాలు అందుకొంది. కేంద్రం నుంచి రూ.38,669 కోట్లు గ్రాంటుగా వస్తాయని అంచనా వేయగా... అందులో ఇప్పటి వరకు కేవలం రూ.4,813 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇది అంచనాల్లో కేవలం 12 శాతం మాత్రమే. నెల వారీ పన్ను ఆదాయాలు చూస్తే ఏప్రిల్‌లో రూ.7,618 కోట్లు, మేలో 5,578 కోట్లు, జూన్‌లో రూ.7,027 కోట్లు వచ్చాయి. జులైలో రూ.8,365 కోట్లు, ఆగస్టులో రూ.9 వేల కోట్లు, సెప్టెంబర్‌లో రూ.8,268 కోట్ల పన్ను ఆదాయం వచ్చింది.

క్రమంగా తగ్గిన ఆదాయం

కరోనా రెండో దశ ప్రభావంతో పడిపోయిన ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తోంది. పూర్తి గణాంకాలు వచ్చే వరకు సెప్టెంబర్ ఆదాయం ఆగస్టు నెలను అధిగమిస్తుందని అంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.25,573 కోట్ల రుణాలను తీసుకొంది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.45,509 కోట్లలో ఇది 56 శాతం. అప్పులతో కలిపితే సెప్టెంబర్ వరకు ఖజానాకు రూ.78,708 కోట్లు సమకూరగా... అందులో రూ.76,245 కోట్లు ఖర్చు చేసింది. బడ్జెట్ వ్యయ అంచనాల్లో 38.42 శాతం. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.61,168 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.15,077 కోట్లు. ఆయా రంగాల వారీగా చూస్తే సాధారణ రంగంపై రూ.20,479 కోట్లు, సామాజిక రంగంపై రూ.26,661 కోట్లు, ఆర్థిక రంగంపై రూ.29,105 కోట్లు ఖర్చు చేసింది.

ఇదీ చదవండి:mlc election schedule: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

ABOUT THE AUTHOR

...view details