తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆవిష్కరణ'ల ఖజానా తెలంగాణ.. ఇన్నోవేషన్‌ సూచీలో దేశంలో రెండో ర్యాంకు.. - ఇన్నోవేషన్‌ సూచీలో దేశంలో రెండో ర్యాంకు

Innovation Index Telangana: నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో తెలంగాణ రెండో ర్యాంకును సాధించింది. తెలంగాణ రాష్ట్రం బహుళజాతి సంస్థలు, స్టార్టప్‌లకు నెలవుగా మారిందని, అన్ని కొలమానాల్లోనూ మంచి పనితీరు కనబరిచిందని నివేదికలో నీతి అయోగ్​ వెల్లడించింది. పొరుగు రాష్ట్రమైన ఏపీ.. తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. మరోవైపు, ఈ ఘనతపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ హర్షం వ్యక్తం చేశారు.

innovation rank
innovation rank

By

Published : Jul 22, 2022, 3:59 AM IST

Innovation Index Neeti Ayog: నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ రెండో ర్యాంకును సాధించింది. కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ తొమ్మిదో స్థానానికి పరిమితమైంది.. గురువారం ఉదయం ఇక్కడి నీతి ఆయోగ్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సుమన్‌ బేరి, సీఈఓ పరమేశ్వరన్‌, సభ్యుడు వీకే సారస్వత్‌ నివేదికను విడుదల చేశారు.

ర్యాంకుల్లో క్రితంసారి నాలుగో స్థానంలోఉన్న తెలంగాణ ఈసారి రెండో స్థానం చేజిక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌ 7నుంచి 9వ స్థానానికి పడిపోయింది. 17 పెద్దరాష్ట్రాలు, 10 ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును వేర్వేరుగా మదించి నివేదికను విడుదల చేసినట్లు నీతిఆయోగ్‌ పేర్కొంది. ర్యాంకుల కోసం తీసుకున్న కొలమానాలను ‘ఎనేబులర్స్‌’, ‘పెర్ఫార్మర్స్‌’ పేరుతో గ్రూపులుగా విభజించారు. వాటిలో ‘ఎనేబులర్స్‌’ విభాగంలో తెలంగాణ నాలుగోస్థానం, ఏపీ 8వస్థానం సాధించాయి. పెర్ఫార్మర్స్‌ విభాగంలో తెలంగాణ తొలి స్థానం పొందగా.. ఏపీ 14తో సరిపెట్టుకుంది.

విజ్ఞాన వ్యాప్తిలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం పనితీరును మెరుగు పరుచుకోలేకపోయిందని నీతి ఆయోగ్‌ నివేదికలో పేర్కొంది. ఆ ప్రభావం ఉత్పత్తులు, సేవల్లో ప్రభావం చూపిందని తెలిపింది. అందువల్ల కేవలం జ్ఞానాన్ని సముపార్జించడంపై దృష్టి పెట్టడమే కాకుండా దాన్ని ఉత్పత్తులు, సేవల్లోకి మార్చుకోవాలని సూచించింది.

"తెలంగాణ బహుళజాతి సంస్థలు, స్టార్టప్‌లకు నెలవుగా మారింది. రాష్ట్రం అన్ని కొలమానాల్లోనూ మంచి పనితీరు కనబరిచింది. ఐసీటీ ల్యాబ్స్‌తో కూడిన పాఠశాలల సంఖ్య 17% నుంచి 35%కి చేరింది. ఉన్నత విద్యలో ఎన్‌రోల్‌మెంట్స్‌ (ప్రతి లక్ష జనాభాకు) 9.7 నుంచి 15.7కి పెరిగాయి. నాలెడ్జ్‌ వర్కర్స్‌ను తయారు చేయడంలో రాష్ట్రానికున్న సత్తాకు ఇది అద్దం పడుతోంది. దీనికితోడు పేటెంట్లు, ట్రేడ్‌ మార్కులు, ఇండస్ట్రియల్‌ డిజైన్‌లాంటి అంశాల్లోనూ రాష్ట్రం సత్తాను చాటుకుంది. స్టార్టప్స్‌ 4,900 నుంచి 9వేలకు చేరాయి."

- నివేదికలో నీతి ఆయోగ్‌

మంత్రి కేటీఆర్‌ హర్షం
నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ఆవిష్కరణల నివేదికలో తెలంగాణ అన్ని విభాగాల్లో రెండో స్థానంలో, ప్రదర్శన విభాగంలో అగ్రస్థానంలో నిలవడంపై తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీ రామారావు గురువారం ట్విటర్‌లో హర్షం వ్యక్తంచేశారు. ఆవిష్కరణల్లో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తోందని, సీఎం కేసీఆర్‌ దార్శనిక నాయకత్వానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిష్కరణలు, మౌలిక వసతులు, సంతులిత అభివృద్ధి (ఐఐఐ) మంత్రం సత్ఫలితాలను ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. కేసీఆర్‌ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు లభించిన పురస్కారమని మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌లు సంతోషం వ్యక్తంచేశారు.



ఇవీ చదవండి:ఎన్డీఆర్​ఎఫ్​ నిధులు అడిగే ధైర్యం కిషన్​రెడ్డికి లేదు: కేటీఆర్

ఇండిగో విమానంలో ప్యాసింజర్​ హల్​చల్​.. బ్యాగ్​లో బాంబు ఉందంటూ..

ABOUT THE AUTHOR

...view details