రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల వ్యయం విషయంలో పోటీ చేసే అభ్యర్థులు పారదర్శకత పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సూచించారు. ఈ ఎన్నికల్లో నగదు పంపిణీ, మద్యం ప్రభావం, వివిధ రూపాల్లో బహుమతుల పంపిణీ లేకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఎస్‌ఈసీ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల వ్యయ పరిశీలకుల సమావేశం నిర్వహించారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నిబంధనల ప్రకారం పరిమితి చేసిన రూ. 5 లక్షలకు లోబడి ఖర్చు చేసేలా చూడాలన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో ఒక్కొక్కరి చొప్పున వారికి అనుబంధంగా ఒకరిద్దరు అనుబంధ సహాయక వ్యయ పరిశీలకులు ఉంటారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని సర్కిళ్లల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తామన్నారు.