ఇటీవలి కాలంలో రాష్ట్రంలో పెరిగిపోతున్న ఆన్లైన్ రుణాల మంజూరు సంస్థల వేధింపులు... బాధితుల ఆత్మహత్యల ఘటనలపై డీజీపీ స్పందించారు. ఏ తరహా రుణాలు ఇచ్చే సంస్థలకైనా రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఆర్బీఐ చట్టానికి లోబడి రిజిస్టర్ కాని ఏ నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు చట్టబద్దత లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఆన్లైన్ యాప్‌లలో అధికశాతం ఆర్భీఐలో నమోదు కాలేదని... అందువల్ల వారికి రుణాలు మంజూరు చేసే అధికారం లేదని తెలిపారు.
యాప్‌ల నుంచి బెదిరింపులు వస్తుంటే ఫిర్యాదు చేయండి: డీజీపీ
ఆన్లైన్, ఆఫ్‌లైన్... ఏ విధమైన బ్యాంకుల నుంచి రుణాలు అందించేవారికి రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో యాప్‌ల ద్వారా రుణాలు తీసుకొని తరువాత వారి వేధింపులు భరించలేక ఇటీవల పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలపై పోలీస్ బాస్ స్పందించారు. యాప్‌ల నుంచి బెదిరింపులు వస్తే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
ఈ ఆన్లైన్ యాప్‌లలో అత్యధికంగా చైనాకు చెందినవే ఉన్నాయని వెల్లడించారు. వాటికి రిజిస్టర్ చిరునామా, చరవాణి నెంబర్ తదితర వివరాలు ఉండవని తెలిపారు. ఈ నేపథ్యంలో రుణాలు స్వీకరించే సమయంలో ఏవిధమైన షరతులు అంగీకరించొద్దని డీజీపీ సూచించారు. ముఖ్యంగా వ్యక్తిగత వివరాలు, ఆధార్, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లో అందజేయవద్దని కోరారు. అంతర్జాలం ద్వారా రుణాలు ఇస్తామంటూ ప్రకటనలిస్తున్న యాప్‌లు వాటిని డౌన్లోడ్ చేసుకోవద్దన్నారు. యాప్‌ల నుంచి బెదిరింపులు వస్తుంటే పోలీసులకు ఫిర్యాదులు చేయాలని డీజీపీ సూచించారు.
ఇదీ చూడండి:ఒత్తిళ్లకు యువత బలి : పరువు తీసి వేధిస్తున్న లోన్ యాప్స్