గొర్రెల సంపదలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ.. Telangana sheep distribution: రాష్ట్రంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా సర్కారు అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకంపై సర్వత్రా విస్తృత చర్చ సాగుతోంది. వ్యవసాయ అనుబంధంగా గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న యాదవులు, కురుమల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేసీఆర్ సర్కారు 2017లో ప్రతిష్టాత్మక గొర్రెల పంపిణీ పథకం ప్రవేశపెట్టింది.
ఎన్సీడీసీ ఆర్థిక సహకారంతో మొత్తం 11వేల120 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో శ్రీకారం చుట్టిన ఈ పథకం కింద.. మొదటి విడతలో 5 వేల కోట్ల రూపాయలు పైగా వెచ్చించి 75 శాతం రాయితీపై 3,60,098 మందికి గొర్రెల యూనిట్లు లబ్ధిదారులకు పంపిణీ చేసింది. రెండో విడత పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వేళ.. దేశవ్యాప్తంగా.. ప్రత్యేకించి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ పథకం అమలు తీరుపై ఆసక్తిగా ఆరా తీస్తున్నాయి.
తమ రాష్ట్రాల్లో ఈ తరహా పథకం అమలు చేసేందుకు సన్నద్ధవుతున్న తరుణంలో.. తాజాగా ఈ పథకం అమలు తీరు, విధివిధానాలపై అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర అధికార బృందం రాష్ట్రానికి విచ్చేసింది. హైదరాబాద్ మాసబ్‌ట్యాంకు రాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి సమాఖ్య ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్‌తో.. మహారాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శశాంక్ కాంబ్లే నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం భేటీ అయింది.
మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం కోసం పథకం అమలు చేస్తున్న దృష్ట్యా.. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదిగిందని.. గొర్రెలు, మేకలు అభివృద్ధి సమాఖ్య ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ తెలిపారు.ఇటీవల కర్ణాటకలో కూడా ఈ పథకం అమలు చేయాలని ఆ రాష్ట్ర సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో ఓ బృందం తెలంగాణ వచ్చి అధ్యయనం చేసి వెళ్లింది. తాజాగా మహారాష్ట్రలో కూడా ఈ పథకం అమలు చేయాలని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం యోచిస్తున్న దృష్ట్యా.. రాష్ట్ర స్థాయి బృందం పరిశీలనకు వచ్చింది.
"మా మంత్రివర్యులు వి.కె.పాటిల్.. ఈ పథకం అమలు చేయాలని నిశ్చయంతో ఉన్నారు. ముఖ్యమంత్రి షిందే, ఉపముఖ్యమంత్రి ఫడణవీస్ .. వీళ్లు కూడా ఈ పథకం అమలుపై శ్రద్ధ చూపుతున్నారు. ఈ పథకం ద్వారా మార్పును తెలంగాణ రాష్ట్రం సాధించింది. అదే విధంగా మా రాష్ట్రంలో కూడా అతి త్వరలో ఈ పథకాన్ని అమలు చేస్తాం."-డాక్టర్ శశాంక్ కాంబ్లే, ఎండీ మహారాష్ట్ర గొర్రెలు అభివృద్ధి సంస్థ
త్వరలో అమలు చేయబోతున్న రెండో విడతలో మరో 3,57,971 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే 8710 గ్రామ పంచాయతీల్లో 7వేల 846 సొసైటీల్లో 7,18,069 మంది సభ్యులుగా చేరారు. రాష్ట్రవ్యాప్తంగా 100 వరకు సంచార పశు వైద్యశాలలు అందుబాటులోకి తెచ్చి సేవలందిస్తోంది.
ఇవీ చదవండి: