వేధింపులకు పాల్పడుతూ షీ బృందాలకు దొరికే ఆకతాయిల సమస్త సమాచారాన్ని నిక్షిప్తం చేసే బృహత్ కార్యాన్ని తెలంగాణ మహిళా భద్రత విభాగం కొనసాగిస్తోంది. అలాంటి వారి వేలిముద్రల నుంచి ఫొటోల దాకా వారికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఓ యాప్‌లో పొందుపరుస్తున్నారు.
ఆకతాయిల చిట్టా సిద్ధం.. రెండోసారి చిక్కితే అంతే ఇక! - Telangana Women's Security Department
అమ్మాయిల్ని వేధిస్తే పట్టుకొని వదిలేస్తారులే.. మహా అయితే జరిమానా విధించి కౌన్సెలింగ్ చేస్తారు అంతే కదా! ఇలా అనుకునే పోకిరీల పనిపట్టే దిశగా తెలంగాణ మహిళా భద్రత విభాగం కార్యాచరణ ప్రణాళిక కసరత్తు సాగుతోంది.
తెలంగాణలో ప్రస్తుతం 300లకు పైగా షీ బృందాలు విధి నిర్వహణలో నిమగ్నమయ్యాయి. పలు హాట్‌స్పాట్‌లలో నిరంతరం ఈ బృందాలు మఫ్టీలో మకాం వేస్తున్నాయి. ఎవరైనా పోకిరీలు వేషాలు వేస్తూ తారసపడితే వెంటనే స్పై కెమెరాలతో చిత్రీకరిస్తున్నాయి. తగిన ఆధారాలను కెమెరాలో రికార్డు చేశాక సిబ్బంది ఆకతాయిల్ని అదుపులోకి తీసుకుంటున్నారు.
అనంతరం వేధింపుల స్థాయిని బట్టి పెట్టీ కేసులు నమోదుచేస్తున్నారు. తీవ్రత ఎక్కువగా ఉంటే నిర్భయ కేసుల్ని నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తూ మరోసారి ఇలాంటి పనులకు పాల్పడొద్దని హితబోధ చేస్తున్నారు. వారి ఫొటోలు, వేలిముద్రలు, ధ్రువీకరణ పత్రాలు, సెల్‌ఫోన్ నంబర్లను ‘షీ’ సాఫ్ట్‌వేర్ యాప్‌లో నమోదు చేస్తూ ఆకతాయిల అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. అలా కౌన్సెలింగ్ పొందిన వ్యక్తి మరోసారి అలాంటి పనిచేస్తే వివరాలు నమోదు చేసే సమయంలో సంబంధిత యాప్ ఇట్టే గుర్తిస్తుంది. వీరిని ‘రిపీటెడ్ అఫెండర్’గా పరిగణించి ఐపీసీ సెక్షన్లు నమోదు చేస్తున్నారు.
- ఇదీ చూడండి: అంచనాలను అందుకోని ఆదాయం