కార్యాలయాల తరలింపు ప్రణాళికలు ఖరారు
సచివాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ప్రస్తుత భవనాల్లోని కార్యాలయాల తరలింపునకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించేందుకు వీలుగా ప్రస్తుత భవనాల్లోని వివిధ శాఖల కార్యాలాయాలను వీలైనంత త్వరగా తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. అందుకు అనుగుణంగా సీఎస్ ఎస్కే జోషి సంబంధిత అధికారులతో చర్చించారు.
సచివాలయ తరలింపునకు ప్రణాళిక క్రమ సంఖ్య | ప్రభుత్వ శాఖలు | ప్రతిపాదిత తరలింపు భవనం |
1 | సాధారణ పరిపాలన, ఆర్థిక, హోం, న్యాయ, ప్రణాళిక శాఖ | బూర్గుల రామకృష్ణారావు భవన్ |
2 | వ్యవసాయం | కోఠి - మార్క్ ఫెడ్ భవనం |
3 | పశుసంవర్ధకం | మాసబ్ ట్యాంక్ లోని సంచాలకుల కార్యాలయం |
4 | బీసీ సంక్షేమం | మాసబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ |
5 | అటవీశాఖ | అరణ్యభవన్, సైఫాబాద్ |
6 | విద్యాశాఖ | నాంపల్లిలోని ఎస్సీఈఆర్టీ భవనం |
7 | విద్యుత్ శాఖ | విద్యుత్ సౌధ, సోమాజిగూడ |
8 | వైద్య, ఆరోగ్యశాఖ | ప్రకృతి చికిత్సాలయం, బేగంపేట |
9 | నీటిపారుదల శాఖ | ఈఎన్సీ కార్యాలయం - ఎర్రమంజిల్ |
10 | గృహనిర్మాణశాఖ | హిమాయత్ నగర్లోని కార్పొరేషన్ భవనం |
శాఖాధిపతుల కార్యాలయాల్లోకి తరలించేలా చర్యలు
వివిధ శాఖల కార్యాలయాలను తరలించేందుకు అనువైన భవనాల గుర్తింపు ప్రక్రియ చాలా రోజుల నుంచి సాగుతోంది. శాఖాధిపతుల కార్యాలయాల్లోకి తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు చాలా శాఖల కార్యాలయాలు ఎక్కడకు తరలించాలన్న విషయమై స్పష్టత వచ్చింది.
వెంటనే ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వ ఆదేశం
మిగతా శాఖల తరలింపునకు సంబంధించి ఇంకా భవనాలు గుర్తించాల్సి ఉంది. కార్యాలయాల తరలింపు కోసం ఆయా శాఖల్లో నోడల్ అధికారులను నియమించారు. అటు తరలింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు శాఖల వారీగా గడవు విధించారు. రెండు రోజుల నుంచి రెండు నెలల సమయం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను తరలించేందుకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉండగా... గరిష్ఠంగా రెవెన్యూ శాఖ తరలింపునకు రెండు నెలల సమయం ఉంది. ప్రభుత్వం అధికారికంగా ఆదేశించటం వల్ల తరలింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.
సచివాలయం తరలింపునకు ప్రణాళిక సిద్ధం అత్యాధునిక ప్రమాణాలతో భవనాల నిర్మాణం అటు శాఖల వారీగా ఎంత విస్తీర్ణం పడుతుందన్న విషయంలో కూడా ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. పాత సచివాలయంలో 1969మంది ఉద్యోగులు పనిచేసేలా నిర్మించారు. ప్రస్తుతం 1365 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. వీరికోసం మూడు లక్షలా 93వేలా 800 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమని అంచనా. అత్యధికంగా సాధారణ పరిపాలనా శాఖలో 319 మంది ఉద్యోగులు ఉండగా... 88వేల చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమవుతుందని అంచనా వేశారు.
ఇవీ చూడండి: డిగ్రీలో భారీగా మిగిలిన సీట్లు