లాక్డౌన్లో ఆర్టీసీ కార్గో సేవలను అట్టహాసంగా ప్రారంభించింది. ప్రస్తుతం 94 కార్గో బస్సులతో ఆర్టీసీ సేవలను అందిస్తోంది. టీఎస్ ఫుడ్స్, సీడ్స్, వ్యవసాయ శాఖకు కార్గో బస్సులను నడుపుతోంది. ఇంకా పౌర సరఫరా శాఖకు, బేవరేజేస్కు కూడా నడపాలని చూస్తోంది. మరో 100 కార్గో బస్సులు సిద్ధమవుతున్నాయి. అన్నీ అందుబాటులోకి వస్తే.. సుమారు 200 కార్గో సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే కార్గో బస్సులతో ఆర్టీసీకి రూ.1.25 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు.
ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్లు ఉన్నాయి. సమర్థవంతమైన యంత్రాంగం, అధికారులు ఉన్నారు. వీటిని సమృద్ధిగా వినియోగించుకుంటే పార్శిల్ సేవలను సైతం విజయవంతంగా నడిపించవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. పార్శిల్ సేవలకు సంబంధించిన విధివిధానాలకు ఆరు మంది సభ్యులతో ఓ కమిటీని వేశారు. పార్శిల్ ధరలు, సిబ్బంది నియామకం వంటి ఇతర అంశాలను కమిటీ నిర్ణయిస్తుంది. ఇప్పటికే హకీంపేట్‌లోని RTC కేంద్రంలో... మార్కెటింగ్ సిబ్బందికి.... బుకింగ్, డెలివరీపై శిక్షణ ఇచ్చారు. ఇప్పటివరకు 140 బస్టాండ్లను గుర్తించారు.