Telangana SI ASI Final Exam Dates: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్సై, ఏఎస్సై.. తత్సమాన ఉద్యోగాల తుది పరీక్ష ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించడానికి పోలీసు నియామక మండలి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు శనివారం వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు రెండు రోజుల్లో నాలుగు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
ఐటీ, పీటీవో, ఫింగర్ ప్రింట్స్ బ్యూరోలో ఏఎస్సై అభ్యర్థులు రెండు పరీక్షలు రాయాలి. తుది పరీక్ష రాసే అభ్యర్థులంతా ఈ నెల 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 6వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకూ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి www.tslprb.in వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని నియామక మండలి ఛైర్మన్ వి.వి శ్రీనివాస్ తెలిపారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ కాని వారు support@tslprb.inకు మెయిల్ చేయాలని సూచించారు. లేదంటే 9393711110, 9391005006 నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు.
Telangana Si Exam: హాల్ టికెట్ తీసుకున్న వారు అందులో తెలిపిన విధంగా నిర్ణీత ప్రాంతంలో పాస్పోర్ట్ ఫొటో అంటించాలని పేర్కొన్నారు. ఫొటో గుర్తింపులేని వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమన్నారు. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషా పరీక్షలను తుది ఎంపికకు పరిగణించకున్నా.. వీటిలో కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
పోటీ విపరీతం: ఈసారి కానిస్టేబుళ్ల పోస్టులకు పోటీ తక్కువగా ఉండగా.. ఎస్సై పోస్టులకు మాత్రం విపరీతమైన పోటీ నెలకొంది. మొత్తం 587 పోస్టులకు గానూ తొలుత 2 లక్షల 47వేల 630 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దేహదారుఢ్య ఫలితాల అనంతరం వీరిలో 59వేల 574 మంది మాత్రమే విగిలారు. అంటే ఒక్కో కొలువుకు 101 మంది వరకు పోటీలో ఉన్నారు. మొత్తం పోస్టుల్లో సివిల్ విభాగంలోనే 554 పోస్టులు ఉన్నాయి.