తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజా భద్రత - సమగ్ర కార్యాచరణ కేంద్రంతో నేరాలకు చెక్ - తెలంగాణ పోలీసుల వార్తలు

శాంతి భద్రతలు అదుపులో ఉన్న చోట ప్రజలు నిర్భయంగా ఉండగలరు. అందుకు పోలీసులు సమర్థవంతంగా ఉంటేనే అది సాధ్యం. అయితే వారికి పూర్తి సాంకేతికత అందిస్తే ఇక నేరాలు పూర్తి స్థాయిలో తగ్గిపోతాయి. ఇందుకు తెలంగాణ పోలీసులే నిదర్శనం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖకు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతులు ప్రభుత్వం అందించింది. వాటి ద్వారా దేశంలోనే అత్యుత్తమ పోలీసు వ్యవస్థగా తెలంగాణ ఉంది. ఇందుకోసం దేశంలో మొట్టమొదటిగా 'ప్రజా భద్రత - సమగ్ర కార్యాచరణ కేంద్రం(పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్)'ను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసింది. దీని ద్వారా క్లిష్టమైన కేసుల్లో కూడా నిందితులను పోలీసులు వేగంగా పట్టుకుంటున్నారు.

public safety integrated operations centre
ప్రజా భద్రత - సమగ్ర కార్యాచరణ కేంద్రం

By

Published : Jan 20, 2021, 4:44 PM IST

నిత్యం ఒత్తిళ్ల మధ్య పనిచేసే పోలీసులు.. జరగబోయే నేరాలు, నేరస్థులపై ఎల్లప్పుడూ కన్నేసి ఉంచడం సాధ్యంకాదు. ఈ లోటును తీర్చేలా నేరస్థులు, నేరాలకు సంబంధించిన ప్రత్యక్ష సమాచారం ఎప్పటికప్పుడు పోలీసులకు అందేలా ' ప్రజా భద్రత-సమగ్ర కార్యాచరణ కేంద్రం(పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్)ను రాష్ట్ర పోలీసు శాఖ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం తెలంగాణ పోలీసుల సాంకేతిక సామర్థ్యానికి ప్రతీక. అనూహ్య పరిస్థితి తలెత్తినప్పుడు క్షేత్ర స్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు తాజా సమాచారానికి తమ డేటాబేస్​లోని పూర్వపు చరిత్రను జోడించి అందించడం దీని ప్రత్యేకత. పోలీసు రికార్డుల్లో ఉన్న నేరస్థుడు రోడ్డెక్కగానే సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేయడం వంటి సాంకేతికత దీని ప్రత్యేకత. ఒక్క మాటలో చెప్పాలంటే ఆకాశం నుంచి రాజధాని నగరంలోని అణువణువునూ అనుక్షణం గమనిస్తున్న అద్భుతంగా చెప్పవచ్చు.

ఇలాంటి కేంద్రాలను జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలోనూ ఏర్పాటు చేసి వాటన్నింటినీ హైదరాబాద్ బంజారాహిల్స్​లోని కమాండ్​ కంట్రోల్​ రూమ్​కు పోలీసులు అనుసంధానం చేయనున్నారు. దాదాపు రూ. 600 కోట్ల వ్యయంతో ఈ కంట్రోల్​ రూమ్​ను నిర్మించారు. ఈ కమాండ్ సెంటర్ నుంచి ఒకేసారి రాష్ట్రంలోని 10 లక్షల కెమెరాల్లో నమోదయ్యే దృశ్యాలను వీక్షించవచ్చు.

పోలీసులకు తోడుగా

ఈ సాంకేతికతతో గతంలో నేరాలకు పాల్పడిన వారు వాడిన వాహనాలకు సంబంధించిన నంబర్లను డేటాబేస్​లో నిల్వ చేస్తారు. వాటిని కంట్రోల్ రూమ్​కు అనుసంధానం చేస్తారు. నేరం జరిగిందని సమాచారం వచ్చినప్పుడు ఘటన చుట్టూ నిర్దిష్ట పరిధిలో తమ డేటాబేస్​లో ఉన్న వాహనాల కదలికలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని కెమెరా ద్వారా ఈ సాఫ్ట్​వేర్ పట్టేస్తుంది. అంటే నేరం జరిగిందని సమాచారం ఇవ్వగానే కార్యాచరణ కేంద్రంలో ఉన్న సిబ్బంది రంగంలోకి దిగుతారు. నేరం జరిగిన సమయానికి కాస్త ముందు నుంచి నేరం జరిగిన తర్వాత రికార్డయిన దృశ్యాలను ఎంత ముందుకు కావాలో అంత ముందుకు, వెనక్కి వెళ్లొచ్చు. ఇలా చుట్టుపక్కల నాలుగైదు కిలోమీటర్ల పరిధిలోని కెమెరాల్లో నమోదయిన దృశ్యాలను క్షణాల్లో విశ్లేషిస్తారు. ఇదంతా కంప్యూటర్లు వాటికవే నిర్వర్తిస్తాయి. దాంతో విశ్లేషణ క్షణాల్లో పూర్తవుతుంది. ఒకవేళ పాత నేరస్థుల వాహనాలు ఆ చుట్టుపక్కల ఉండి ఉంటే అవి వెళ్లిన దారిలో పోలీసులను అప్రమత్తం చేస్తుంది. దాంతో నిందితులను పట్టుకోవడం సులభం అవుతుంది.

రౌడీషీటర్ల ఆట కట్టించేలా

నగరంతో పాటు జిల్లా కేంద్రాల్లోను రౌడీషీటర్ల ఆగడాలు ఎక్కువగా ఉంటాయి. వారి వాహనాల నంబర్లన్నీ కంట్రోల్ రూంకు అనుసంధానమై ఉంటాయి. వారు రోడ్డు మీదకు రాగానే పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులకు, అక్కడున్న గస్తీ బృందానికి ఫలానా రౌడీషీటర్, ఫలానా ప్రాంతంలో ఉన్నాడంటూ సంక్షిప్త సందేశం వెళ్లిపోతుంది. అంతే కాకుండా వదిలేసిన వస్తువులు ఎవరివో పట్టిస్తుంది.

ఆగంతకులను పట్టిస్తుంది

వాహనాలు, బ్యాగుల వంటి వాటిలో ఉగ్రవాదులు బాంబులు పెట్టి వాటిని జనసమూహం ఉండే ప్రాంతాల్లో వదిలేసి వెళ్లిపోతారు. ఎవరైనా వాటిని గుర్తించినా ఎవరు పెట్టి వెళ్లారో తెలుసుకోవడం కష్టం. ఇందుకోసం పోలీసులు ప్రత్యేక విధానం రూపొందించారు. ఏదైనా అనుమానాస్పద వస్తువు కనిపించినపుడు సమీపంలోని సీసీ కెమెరా నుంచి ఫీడ్ తీసుకుంటారు. సదరు వస్తువు గుర్తించిన సమయానికి ముందు నుంచి ఆ కెమెరాలో నమోదయిన దృశ్యాలను విశ్లేషిస్తారు. ఏదో ఒక సమయంలో ఆగంతకుడు ఆ వస్తువు అక్కడ పెట్టి ఉంటాడు కాబట్టి ఆ దృశ్యం కనిపించే వరకూ వెనక్కి వెళుతూనే ఉంటారు. ఒకసారి పెట్టిన వ్యక్తిని పసిగడితే చాలు ఆ తర్వాత అతనెవరో తెలుసుకోవడం మొదలు పెడతారు. అతను వెళ్లిన మార్గంలోని సీసీటీవీ కెమెరాలు అతని ఆచూకీ చెప్పేస్తాయి.

చైన్​ స్నాచర్లపై నిఘా

ఏదైనా నేరం జరిగిందని సమాచారం వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో గతంలో అలాంటి నేరాలు చేసిన వారి వివరాలను వారి ఫొటోలతో సహా సంబంధిత పోలీసులకు ఈ కేంద్రం పంపుతుంది. ఉదాహరణకు అమీర్ పేటలో గొలుసు దొంగతనం జరిగింది. గతంలో అక్కడ గొలుసు దొంగతనాలకు పాల్పడిన వారి ఫొటోలు, చిరునామా, ఫోన్ నంబర్ల వంటివి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు వెళ్లిపోతాయి. దాంతో వారిపై నిఘా పెట్టడం సులభం అవుతుంది. దీంతో పాటు ముఖ్యమైన నేరాలకు సంబంధించి డేటాను స్టోర్ చేస్తుంది.

ఆర్టిఫీషియల్​ ఇంటెలిజన్స్​ కోడింగ్​

రాష్ట్రంలో ప్రముఖులు నివసించే ప్రాంతాల్లో అపరిచితులు ఎక్కువసేపు తచ్చాడుతుంటే ఈ కేంద్రం పట్టేస్తుంది. ఆయా ప్రాంతాల్లో నిర్దుష్ట సమయం అంటే సుమారు ఐదు నిముషాల కంటే ఎక్కువ సేపు ఎవరైనా నిలబడి ఉంటే అక్కడున్న సీసీ కెమెరా పసిగడుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నారని అక్కడకు దగ్గర్లో ఉన్న గస్తీ పోలీసులతో పాటు సదరు పోలీస్ స్టేషన్ సిబ్బందికి కార్యాచరణ కేంద్రంలోని కంప్యూటర్లు వాటంతట అవే సందేశం పంపుతాయి. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకొని అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించవచ్చు.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా

రహదారిలో ర్యాలీ జరుగుతుంటే ఆ దారి వెంబడి ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయో ఈ కేంద్రంలో కనిపిస్తాయి. ఆ కెమెరాల ద్వారా పోలీసులు ర్యాలీ తీరు గమినిస్తుంటారు.

ఉల్లంఘనలకు చెక్​

అంతే కాకుండా ట్రాఫిక్ నిబంధనలు ఎడా పెడా ఉల్లంఘించేవారి వాహన నంబర్లను కంట్రోల్ రూంకు అనుసంధానం చేస్తున్నారు. సదరు వాహనాలు రోడ్డుమీదకు రాగానే కెమెరాలు వాటిని గుర్తిస్తాయి. వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం వెళుతుంది. వెంటనే అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు.

త్వరలో అందుబాటులోకి రానున్న బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తెలంగాణ పోలీసులు.. పూర్తి స్థాయి సాంకేతిక సంపత్తిలో దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలిచే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:'నీళ్లు, నిధులు, నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం'

ABOUT THE AUTHOR

...view details