తెలంగాణ

telangana

ETV Bharat / state

Krishna River Pollution: కాలుష్య కోరల్లో కృష్ణా నది - Krishna River Pollution updates

Krishna River Pollution: కృష్ణా నది నీటి నాణ్యత ప్రమాదంలో పడింది. మూసీ.. కృష్ణా నదిలో కలిసేచోట కాలుష్య తీవ్రత అధికంగా ఉన్నట్టు పీసీబీ తేల్చింది. ఇప్పటికే గోదావరి నది కాలుష్య కోరల్లో చిక్కుకోగా.. ఇప్పుడు కృష్ణా నది నీటి నాణ్యత ప్రమాదంలో పడడం ఆందోళన కలిగిస్తోంది.

Krishna River Pollution
Krishna River

By

Published : Feb 7, 2022, 5:57 AM IST

Krishna River Pollution: కృష్ణా నది.. లక్షల మందికి తాగునీరు అందించే జల తరంగిణి. లక్షల ఎకరాలకు సాగునీరు అందించే రైతుల జీవనాడి. తెలంగాణలో తంగడి వద్ద ప్రవేశించి వాడపల్లి వరకు పరుగులు పెట్టే ఈ నదిలో నీటి నాణ్యత ప్రమాదంలో పడింది. మూడు ప్రాంతాల్లోని పది పాయింట్లలో తనిఖీచేస్తే కాలుష్యం బారిన పడినట్లు తేలింది. కాపర్‌, జింక్‌, కాడ్మియం, నికెల్‌, క్రోమియం వంటి భార లోహాలు కూడా నీళ్లలో ఉన్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) సేకరించిన నీటి నమూనాల విశ్లేషణలో వెల్లడైంది. మూసీ.. కృష్ణా నదిలో కలిసేచోట కాలుష్య తీవ్రత అధికంగా ఉన్నట్టు పీసీబీ తేల్చింది. ఆ నివేదికను పీసీబీ చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కు ఇటీవల సమర్పించింది.మూసీ అంత తీవ్రస్థాయిలో, గోదావరిలా అధికంగా కాకపోయినా..ఈ నది కూడా క్రమంగా కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుండటం కలవరం కలిగిస్తోంది.

నమూనాలను సేకరించింది?

ఎప్పుడు: 2021 అక్టోబరు, నవంబరులో
ఎక్కడెక్కడ: వాడపల్లిలో 7 పాయింట్లు, అలంపూర్‌లో 2, తంగడి వద్ద ఒకచోట.
ఫలితం:నీటి నాణ్యత అన్నిచోట్లా ‘బి’ గ్రేడే. ప్రమాణాల్లో ఉత్తమమైన ‘ఏ’ గ్రేడ్‌ ఎక్కడా రాలేదు.

కాలుష్య తీవ్రత ఏ ప్రాంతంలో, ఎలా ఉంది?

వాడపల్లి: ఇక్కడ ఏడు పాయింట్లలో నీటి నమూనాలు పరిశీలిస్తే ఐదుచోట్ల బీఓడీ గరిష్ఠ పరిమితిని తాకింది. మూసీ నది ఇక్కడే కృష్ణాలో కలుస్తుంది. ఇదే కాలుష్యానికి కారణమవుతోందని, నీళ్లలో స్నానాలూ ఓ కారణమని పీసీబీ విశ్లేషించింది.
తంగడి:ఇక్కడ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది.
అలంపూర్‌:100 మిల్లీ లీటర్ల నీటిలో ‘ఏ గ్రేడ్‌’ ప్రమాణాల ప్రకారం కోలిఫాం బ్యాక్టీరియా 50 లోపే ఉండాలి. వాడపల్లిలో 170, తంగడిలో 180, అలంపూర్‌లో 220గా నమోదైంది.

కాలుష్యానికి కారణాలు ఏంటి?

నదీ పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాల నుంచి మురుగు, పరిశ్రమల వ్యర్థాలు నేరుగా వచ్చి నదిలో కలుస్తున్నాయి. రాష్ట్ర సరిహద్దులోని ఓ పరిశ్రమ నుంచి రసాయన వ్యర్థాలు అలంపూర్‌ వద్ద నదిలో కలుస్తుండటంతో నీళ్లు నల్లగా మారుతున్నాయి. కర్ణాటకలోని పరిశ్రమల వ్యర్థాలతో నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోనూ నది ఎక్కువగా కలుషితమవుతోంది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువ కాలుష్యం ఉండటం ఊరటనిచ్చే అంశమని, పరీవాహక ప్రాంతాల నుంచి మురుగు, పరిశ్రమల వ్యర్థాలు నదిలో కలవకుండా చూడాల్సి ఉందని పీసీబీ వర్గాలు తెలిపాయి.

నీటి నాణ్యత గ్రేడింగ్‌ ఎలా ఇస్తారంటే?

  • బీఓడీ (బయాలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌), డీఓ (నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్‌), అమ్మోనియా, పీహెచ్‌, కొలిఫాం బ్యాక్టీరియా వంటి అంశాల ఆధారంగా నీటి నాణ్యత, కాలుష్యాన్ని లెక్కిస్తారు.
  • ఏ- గ్రేడ్‌: మంచినీళ్లు. బ్యాక్టీరియా తొలగించి తాగాలి.
  • బి- గ్రేడ్‌: ఈ నీళ్లలో నేరుగా స్నానం చెయ్యొచ్చు. కొలిఫాం బ్యాక్టీరియా కొంత అధికంగా ఉంటుంది. క్లోరిన్‌/బ్లీచింగ్‌తో శుద్ధిచేసిన తర్వాతే తాగాలి.
  • సి- గ్రేడ్‌: శుద్ధిచేసి, బ్యాక్టీరియాను తొలగించాకే నీటిని తాగాలి.
  • డి- గ్రేడ్‌: చేపలు, జంతువులకే పనికివస్తాయి.
  • ఈ- గ్రేడ్‌: కేవలం సాగునీటి అవసరాలకే పనికివస్తాయి. ఈ దశ దాటితే ఆ నీళ్లు ఎందుకూ పనికిరావు.

ఇదీచూడండి :Corona Third Wave : 'కరోనా మళ్లీ విరుచుకుపడొచ్చు.. ఇదే కారణం!'

ABOUT THE AUTHOR

...view details