తెలంగాణకు మూణ్నాలుగు రోజులకొకసారి 2-3 లక్షల టీకాలను పంపిస్తే.. పంపిణీలో ఆందోళన నెలకొంటుందని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు టీకాల సరఫరాపై తెలంగాణ వైద్యశాఖ తాజాగా ప్రతిపాదనలను పంపించింది. దీనిపై ఆదివారం వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఎందుకింత అవసరం?
కేంద్ర ప్రభుత్వం టీకాల కొరత లేదని పదేపదే చెబుతోంది. ఇటీవల 4 రోజుల పాటు టీకాల ఉత్సవం చేపట్టాలని ఆదేశించింది. వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో జనవరి 16న తొలిడోసు ప్రారంభానికి ముందు ఒకేసారి 10 లక్షల డోసులు పంపిన కేంద్రం.. తర్వాత కూడా 4-5 లక్షల చొప్పున ఇప్పటివరకూ సుమారు 30 లక్షల డోసులను సరఫరా చేసింది. మొదట్లో వైద్యసిబ్బందికి, తర్వాత పోలీసులు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్ సిబ్బందికి ఇచ్చారు. ఆయా శాఖల సిబ్బంది ఆశించిన రీతిలో టీకాలను పొందడానికి ముందుకు రాలేదు. మార్చి 1 నుంచి 60 ఏళ్లు దాటిన వారికి, 45-59 ఏళ్ల మధ్య వయస్కులకు టీకాల పంపిణీని ప్రారంభించాక.. కార్యక్రమం ఊపందుకుంది. రోజుకు సగటున 30-40 వేల వరకూ టీకాలను స్వీకరించారు. గత 3 వారాలుగా 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలను ఇస్తుండడంతో.. పంపిణీ జోరందుకుంది. ప్రస్తుతం రోజుకు సగటున 1.30 లక్షల తొలి డోసు, 20 వేల వరకూ రెండో డోసును స్వీకరిస్తున్నారు. మొత్తంగా రోజుకు 1.50 లక్షల డోసుల పంపిణీ రాష్ట్రంలో జరుగుతోంది. ఇకనుంచి రెండో డోసు కోసం వచ్చేవారి సంఖ్య 50-70 వేలకు చేరుకుంటుంది. ఈ పరిస్థితుల్లో రోజూ సగటున 1.30 లక్షల మందికి తొలి డోసును, సుమారు 70 వేల మందికి రెండో డోసును ఇవ్వాలంటే.. రోజుకు సుమారు 2 లక్షల డోసులు అందుబాటులో ఉండాలి. వారానికి కనీసం 14 లక్షలు అవసరం. ఒకవేళ సంఖ్య పెరిగినా.. వృథాను కలిపితే కచ్చితంగా వారంలో 15 లక్షల డోసులు అవసరమని వైద్యశాఖ ప్రతిపాదించింది. ఇప్పటికే రాష్ట్రంలో 26 లక్షల మందికి తొలి డోసును, 3.6 లక్షల మందికి రెండో డోసును అందజేయడంతో రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన అర్హులందరికీ టీకాలను మే నెలాఖరులోగానే పూర్తి చేయవచ్చంది.