Telangana National Integration Day 2023:రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని (Telangana National Integration Day) నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరగనున్న వేడుకల్లో ముఖ్యమంత్రికేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఉదయం గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం.. పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే వేడుకల్లో సీఎం పాల్గొంటారు. జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం అక్కడి నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
తెలంగాణ శాసన మండలిలో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొని ముందుగా పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీ వద్ద పోచారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మండలిలో జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి గుత్తా నివాళులు అర్పించారు. మండలి ప్రాంగణంలో పలువురు ఎమ్మెల్సీలతో కలిసి గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
జాతీయ సమైక్యతా దినోత్సవాల్లో అందరూ పాల్గొనాలి..: తెలంగాణ రాష్ట్రం భారత సమాఖ్యలో విలీనమైన సెప్టెంబర్ 17ను(KTR on September 17).. జాతీయ సమైక్యతా దినోత్సవంగా తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఇటీవల గుర్తు చేశారు. ఈ రోజును ఘనంగా ఎక్కడికి అక్కడ సంబురంగా నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులకు ఆయన గతంలోనే పిలుపునిచ్చారు. ప్రభుత్వమే పెద్ద ఎత్తున ప్రతి జిల్లా కేంద్రాల్లో నిర్వహించే సంబురాల్లో.. మంత్రులు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేస్తారని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ జాతీయ సమైక్యతా దినోత్సవాల్లో పాల్గొనాలని కోరారు.