Minister KTR US Tour Ended : తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సాగిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ యూకే, అమెరికా పర్యటన విజయవంతంగా పూర్తయింది. రెండు వారాల పాటు సాగిన ఈ పర్యటనలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయని.. ఆ సంస్థల పెట్టుబడులతో రాష్ట్రంలో 42 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయని మంత్రి కేటీఆర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
మంత్రి కేటీఆర్ న్యూయార్క్, లండన్, హ్యూస్టన్, వాషింగ్టన్ డీసీ, హేండర్ సన్, బోస్టన్‌లలో పర్యటించారని ప్రకటనలో పేర్కొన్నారు. 80కి పైగా వ్యాపార సమావేశాలకు హాజరయ్యారని.. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపార విస్తరణకు మెడ్‌ట్రానిక్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, వీఎక్స్‌ఐ గ్లోబల్ సొల్యూషన్స్, స్టేట్ స్ట్రీట్, డాజోన్, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూపు, అలియంట్, స్టెమ్‌క్రూజ్, టెక్నిప్ ఎఫ్‌ఎంసీ, మాండీ, జాప్‌కామ్ గ్రూప్‌లు ముందుకొచ్చాయని అందులో వివరించారు. ఫలితంగా పలు రంగాల్లో కొత్తగా 42 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ప్రతి ప్రత్యక్ష ఉద్యోగంతో 3 లేదా 4 పరోక్ష ఉద్యోగాలూ లభిస్తాయని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు గౌరవం.. : పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ లండన్‌లో జరిగిన 'ఐడియాస్ ఫర్ ఇండియా', అమెరికాలోని నెవెడాలో నిర్వహించిన 'ప్రపంచ పర్యావరణ, నీటి వనరుల కాంగ్రెస్' సదస్సుల్లో ప్రసంగించారని మంత్రి కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు 'ఇంజినీరింగ్ పురోగతి, భాగస్వామ్యానికి చిహ్నం'గా గౌరవం లభించిందని వివరించింది.
''దాదాపు 30 కంపెనీలకు చెందిన ఎన్నారై సీఈవోలతో సమావేశమైన మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడుల అవకాశాలను వారికి వివరించారు. దాంతో నల్గొండలో సొనాటా సాఫ్ట్‌వేర్, కరీంనగర్‌లో 3ఎం-ఎక్లాట్, వరంగల్‌లో రైట్ సాఫ్ట్‌వేర్ సంస్థలు తమ కార్యకలాపాల విస్తరణకు అంగీకరించాయి.'' అని మంత్రి కార్యాలయం ప్రకటనలో స్పష్టం చేసింది.
మంత్రి కేటీఆర్ యూకే, అమెరికా పర్యటన ప్రతినిధి బృందంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సీఆర్‌వో ఆత్మకూరి అమర్‌నాథ్ రెడ్డి, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈవో శక్తి ఎం.నాగప్పన్, పెట్టుబడులు, ఎన్నారై వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, డిజిటల్ మీడియా వింగ్ డైరెక్టర్ కొణతం దిలీప్, డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, ఏరోస్పేస్, ఇన్వెస్ట్ తెలంగాణ ప్రతినిధి వెంకట శేఖర్ ఉన్నారు.