తెలంగాణ

telangana

ETV Bharat / state

చేనేతపై పన్నువేసిన పాపం భాజపాదే: కేటీఆర్‌

KTR LETTER TO BANDI SANJAY: కేంద్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వల్లే దేశంలో రెండో అతిపెద్దదైన టెక్స్​టైల్ రంగం కునారిల్లుతోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. స్వతంత్ర భారతంలో తొలిసారి చేనేతపై పన్ను వేసిన పాపపు ప్రభుత్వం భారతీయ జనతాపార్టీ అని విమర్శించారు. నేతన్నల సంక్షేమంపైన భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​కు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కేంద్రప్రభుత్వం చేనేతకారులకు ఏం చేసిందో చెప్పాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు.

KTR LETTER TO BANDI SANJAY
బండి సంజయ్‌కి కేటీఆర్ బహిరంగ లేఖ

By

Published : May 1, 2022, 7:47 PM IST

Updated : May 1, 2022, 8:03 PM IST

KTR LETTER TO BANDI SANJAY: చరిత్రలో ఎన్నడూ లేనంత భారీగా టెక్స్​టైల్ రంగానికి తమ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు చేస్తోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం పైన నిన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని చాటేలా ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు భాజపా తీరును విమర్శిస్తూ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తమ ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టి దేశానికి మార్గదర్శిగా నిలుస్తోందన్నారు. ఇదే కోవలో దశాబ్దాలుగా నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రం, ప్రభుత్వం చేపట్టని స్థాయిలో విప్లవాత్మకమైన కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం చేపట్టిందన్నారు.

నేతన్నల ఆత్మహత్యలు ఆగలేదా..?: దేశంలో ఏక్కడా లేని విధంగా నేతన్నలకు యార్న్ సబ్సిడీ ఇస్తున్న ఏకైక చేనేత మిత్ర ప్రభుత్వం తమదని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వ హయాంలో నేతన్నల ఆత్మహత్యలు ఆగిన విషయం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ముంబయి, భీవండి, సూరత్ వంటి ప్రాంతాల నుంచి తెలంగాణకి నేత కార్మికులు తిరిగి వస్తున్నది నిజం కాదా..? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

బీమా ఎందుకు ఎత్తేశారు..?: నేతన్నలకు ఉన్న బీమాను ఎత్తేసిన కేంద్ర నిర్ణయంపై బండి సంజయ్ మాట్లాడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రం బీమా ఎత్తేస్తే... తమ ప్రభుత్వం నేతన్నకు ప్రత్యేక బీమా కల్పిస్తుందని తెలిపారు. దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్​టైల్ పార్క్​కి కేంద్రం ఎంత సాయం చేసిందో బండి చెప్పాలన్నారు. భాజపా ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఏనాడైనా తెలంగాణ నేతన్నల సంక్షేమం కోసం వారి భవిష్యత్తు కోసం పార్లమెంట్​లో ఒక మాట అయినా మాట్లాడారా...? అని ప్రశ్నించారు.

నేతన్నలపై నిజమైన ప్రేమ ఉంటే పార్లమెంట్​లో ప్రత్యేక సాయం కోసం బండి సంజయ్ కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. నేతన్నలకు ఏం సాయం చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ఇలానే అసత్యాలతో మోసం చేయాలని చూస్తే చేనేతకారులు భాజపా నేతలకు బుద్ది చెప్పడం ఖాయం అని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Kavitha On LPG Cylinder Price: 'ధరలు పెంచి సామాన్యులకు ఏం సందేశమిస్తున్నారు'

65 గంటలు.. 25 మీటింగ్​లు.. బిజీబిజీగా మోదీ ఫారిన్​ షెడ్యూల్​

Last Updated : May 1, 2022, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details