తెలంగాణ

telangana

ETV Bharat / state

శాసనమండలి నిరవధిక వాయిదా - హైదరాబాద్​ వార్తలు

శాసనమండలి నిరవధిక వాయిదా
శాసనమండలి నిరవధిక వాయిదా

By

Published : Oct 14, 2020, 1:47 PM IST

Updated : Oct 14, 2020, 4:13 PM IST

13:46 October 14

శాసనమండలి నిరవధిక వాయిదా

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా నాలుగు చట్టసవరణలకు పెద్దల సభ ఆమోదం తెలిపింది. స్టాంపు, నాలా, సీఆర్పీసీ చట్టాలకు చేసిన సవరణలకు మండలి ఆమోద ముద్ర వేసింది. మహిళలకు చట్టసభల్లోనూ 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెరాస ఎప్పటి నుంచో కోరుతోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మజ్లిస్, భాజపా సహకరిస్తే గుజరాత్ తరహాలో రహదార్లపై ప్రార్థనా మందిరాలు ఉండకుండా ప్రత్యేకచట్టం తీసుకొస్తామన్నారు. బిల్లుల ఆమోదంతో ఉభయసభల ప్రత్యేక సమావేశాలు ముగిశాయి.  

జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు

ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా బిల్లులపై సభలో చర్చను చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్ట సవరణ బిల్లును పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు మద్దతిచ్చిన భాజపా సభ్యుడు రామచందర్ రావు... ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ల వల్ల బీసీలు నష్టపోతున్నారని అన్నారు. రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం చేయడం తగదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అంబర్ పేటలో మసీదు నిర్మిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారన్న మజ్లిస్ సభ్యుడు జాఫ్రీ... గుజరాత్, అహ్మదాబాద్ నమూనా ఇక్కడకు సరిపోదని అన్నారు. స్థానికసంస్థల తరహాలోనే చట్టసభల్లోనూ మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెరాస ఎమ్మెల్సీ ఆకుల లలిత కోరారు.  

బిల్లును చూడకుండానే

మహిళా రిజర్వేషన్ల కోసం చట్టం చేయాలో వద్దా జీవన్ రెడ్డి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్, భాజపాలపై ఎదురుదాడి చేసిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... బిల్లును చూడకుండానే భాజపా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిందని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కేవలం ఉత్తర్వులు జారీ చేసి వదిలిపెడితే తాము చట్టబద్ధంగా అమలు చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ మీద కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, భాజపా నేతలకు ఏమైనా ప్రేమ ఉంటే రావాల్సిన జీఎస్టీ నిధులతో పాటు ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రహదార్లపై కాలుష్య కోరల్లో ఉండాలని ఏ దేవుడూ కోరుకోడని అన్నారు. రహదార్లపై ప్రార్థనా మందిరాలు ఉండకుండా గుజరాత్​లో మోదీ చట్టం చేశారని... మజ్లిస్, భాజపా సహకరిస్తే తామూ ఇక్కడ అదే తరహా చట్టం తీసుకొస్తామని కేటీఆర్ తెలిపారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించాలని తెరాస ఎప్పటి నుంచో కోరుతోందని అన్నారు.  

జీహెచ్ఎంసీ చట్టసవరణ 

జీహెచ్ఎంసీ చట్టసవరణ అనంతరం సీఆర్పీసీ చట్టసవరణ బిల్లును న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశపెట్టారు. స్టాంపు, నాల చట్టాల సవరణ బిల్లులను ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి ప్రశాంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఎల్ఆర్ఎస్​లోనే నాలా ఛార్జీలు కూడా ఉంటాయన్న ప్రభుత్వం... ఇపుడు విడిగా నాలాకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం ఏ మేరకు సబబని కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి ప్రశ్నించారు. విదేశాల్లో ఉంటున్న వారి ఆస్తుల నమోదు ఎలా ప్రక్రియ ఎలా చేపడతారని భాజపా సభ్యుడు రామచందర్ రావు ప్రశ్నించారు. 

ఇదీ చదవండి:దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి నామినేషన్‌ దాఖలు

Last Updated : Oct 14, 2020, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details