‘యువత అంటే ఇనుప కండలు.. ఉక్కు నరాలే కాదు.. వారి లోపలి దృఢ సంకల్పం..’ ఈ దేశానికి అవసరం అన్నారు స్వామి వివేకానంద. అవే కాదు ‘సృజనాత్మక ఆలోచనలు.. గొప్ప ఆవిష్కరణలూ కూడా’ నేటి అవసరం అని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం యువత ఆలోచనలను మదించి.. వారి వ్యూహాలకు పదును పెట్టి సరికొత్త ఆవిష్కరణల వైపు నడిపించే లక్ష్యంతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఆలోచనలను వివరిస్తూ..
‘తెలంగాణ ఇన్నోవేషన్ యాత్ర’ పేరిట నాలుగురోజుల పాటు సాగే ఓ కార్యక్రమానికి హైదరాబాద్‌లోని టీ-హబ్ అనుబంధంగా ఉండే ఇన్నోవేషన్ సెల్ బుధవారం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని నాలుగు మార్గాల్లో 4,000 కి.మీ. మేర చుట్టివచ్చేలా నాలుగు బృందాలుగా యువ యానం కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో తమ ఆలోచనలను వివరిస్తూ సాగే ఈ యాత్ర చివరకు టీ హబ్‌ను చేరుతుంది. మెరుగైన ఆవిష్కరణలు, ఆలోచనలకు తగిన తోడ్పాటునందించాలనేది ప్రభుత్వ ఆలోచన. ఉన్నత విద్యామండలి, పర్యాటకశాఖ వీరికి సహకారమందిస్తున్నాయి.
20 అంకుర సంస్థలు
ప్రస్తుత సమాజంలో, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న పలు సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించమంటూ ‘టీ-ఐడియాథాన్’ పేరిట యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. వివిధ కళాశాలల విద్యార్థుల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రాగా.. వాటిలో మెరుగైన ఆలోచనలు ఇచ్చిన వంద మందిని ఎంపిక చేశారు. వారికి ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. టీ-హబ్, కాగ్నిజెంట్‌తో పాటు ఇంక్విలాబ్స్, గ్రామ్ బజార్ సంస్థల ప్రతినిధులు ప్రేరకులుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ విద్యార్థులతో పాటు 20 అంకుర సంస్థల ప్రతినిధులు పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలోని సమస్యలకు విద్యార్థులు చూపే పరిష్కారాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని ఈ కార్యక్రమంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్న కల్ట్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.