KTR on T works programme:వినూత్న ఆవిష్కరణలకు వేదికగా మారుస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీ-వర్క్స్ ప్రారంభానికి సిద్ధమైంది. 78 వేల చదరపు అడుగులలో నిర్మించిన టీ-వర్స్క్ భవనం గురువారం ఫాక్స్‌కాన్ సంస్థ చైర్మన్ యాంగ్ యూ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. సంకలిత ప్రోటోటైపింగ్, ఎలక్ట్రానిక్స్ వర్క్‌స్టేషన్, ఫినిషింగ్ షాప్, లేజర్ కటింగ్, పీసీబీ ఫాబ్రికేషన్, కుండల తయారీ, ప్రీ-కంప్లైయన్స్, మెటల్‌షాప్ వంటి అత్యాధునిక సాంకేతికతలు అందుబాటులో ఉంచారు.
రాష్ట్ర ప్రభుత్వం టీ-వర్క్స్‌లో సుమారు 100 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు కేటీఆర్ తెలిపారు. సాఫ్ట్‌వేర్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే టీ-హబ్ ఉండగా హార్డ్‌వేర్‌కు సంబంధించి టీ-వర్స్క్ పనిచేస్తుందని సీఈఓ సుజయ్ కారంపురి అన్నారు. టీ-వర్క్స్ గురువారం ప్రారంభంమవుతున్నప్పటికీ గత ఏడాదే సాప్ట్‌లాంచ్ అయ్యింది. ఇప్పటికే ఇందులోని ఆవిష్కరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. రైతులు నడుంపై ఎక్కువ ఒత్తిడి పడకుండా పొలంలో పని చేసేందుకు ఉపయోగపడే పరికరాన్ని రూపొందించిన గొర్రె అశోక్ కేటీఆర్ ప్రశంసలు అందుకున్నారు.
"కేంద్రం సహకరించకున్నా యువతలోని నైపుణ్యాలు వెలికితీసేలా చర్యలు తీసుకుంటున్నాం. సత్తా ఉన్నవారిని ప్రోత్సహించేందుకు రాష్ట్రప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. టీ- వీహబ్, వీ- హబ్ వంటి వాటిని ఏర్పాటు చేశాం. గురువారం సాయంత్రం టీ వర్క్స్‌ని ప్రారంభిస్తాం. అంతే కాకుండా ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లీవ్ టి వర్క్స్‌ని కూడా ప్రారంభిస్తాం. టీ హబ్ తరహాలోనే టీ వర్క్స్ తప్పక విజయవంతం అవుతుంది. గ్రామీణ ప్రాంత ఔత్సాహిక యువతకు టి వర్క్స్‌తో ఉపయోగం ఉంది. హైదరాబాద్‌లో వందల సంఖ్యలో స్టార్టప్ కేంద్రాలు నెలకొల్పాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంప్ ఈ ప్రాంతంలో ఉంటుంది. "- కేటీఆర్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి
అంతేకాకుండా వరంగల్‌కు చెందిన రాజేంద్రప్రసాద్ గో-కార్టింగ్ వాహనాన్ని ప్రదర్శనకు ఉంచారు. ప్రముఖ సంస్థల ఉత్పత్తుల మాస్ ప్రొడక్షన్‌కు కావలసిన పరికరాలను కూడా టీ-వర్క్స్ అందిస్తుందని సుజయ్ కారంపురి తెలిపారు. 15 వేల కోట్ల రూపాయల ఖరీదైన సాంకేతిక సామగ్రితో ఇది ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.