భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని చెన్నాపురం వద్ద జరిగిన ఎన్కౌంటర్ మృతులకు మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. కుటుంబ సభ్యుల నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకుని కొత్తగూడెం మార్చురీలో భద్రపరచాలని ఎస్పీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చెందిన ఫోరెన్సిక్ నిపుణులతో శవపరీక్ష జరిపాలని.. దాన్ని వీడియో చిత్రీకరించాలని పేర్కొంది.
ఎన్కౌంటర్ పేరిట ముగ్గురిని పోలీసులు కాల్చి చంపారని ఆరోపిస్తూ పౌర హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసింది. అత్యవసర వ్యాజ్యంగా పరిగణించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పోలీసులపై ఐపీసీ 302 సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేయాలని సీఎల్సీ తరపు న్యాయవాది రఘునాథ్ వాదించారు.