తెలంగాణ

telangana

ETV Bharat / state

TS High-court: కళాశాలలు మూసివేసి.. పాఠశాలలు తెరవడమేంటి? - తెలంగాణలో కరోనా విజృంభణ

TS High-court
కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

By

Published : Jan 28, 2022, 11:31 AM IST

Updated : Jan 28, 2022, 3:49 PM IST

11:26 January 28

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

TS High Court on Scools Reopen: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్​ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు ఆన్ లైన్​లో విచారణకు హాజరై.. పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని తెలిపారు. ఇంటింటి జ్వర సర్వే చురుగ్గా కొనసాగుతోందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదించారు. ఇప్పటి వరకు 77 లక్షల ఇళ్లల్లో సర్వే చేసి..3 లక్షల 45 వేల మంది అనుమానితులకు మెడికల్ కిట్లు పంపిణీ చేసినట్లు వివరించారు.

ఆ కిట్లు కేవలం పెద్ద వారి కోసమే...

పిల్లల చికిత్సకు అవసరమైన మందులను ఇవ్వడం లేదని పిటిషనర్ల న్యాయవాదులు వాదించారు. పంపిణీ చేస్తున్న కిట్లు కేవలం పెద్ద వారి కోసమేనని... పిల్లల కోసం మందులను నేరుగా ఇళ్ల వద్ద ఇవ్వకూడదని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఒమిక్రాన్ తీవ్రత పిల్లలపై ఎక్కువగా లేదని... అయినప్పటికీ నిలోఫర్ తో పాటు అన్ని ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.

ఇంకా నిర్ణయం తీసుకోలేదు

కరోనా తీవ్రత పరిస్థితుల్లో కళాశాలల్లో ఆన్ లైన్ బోధన కొనసాగిస్తూ.. పాఠశాలలను మాత్రం ఈనెల 31 నుంచి తెరవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయని న్యాయవాది ఎల్.రవిచందర్... హైకోర్టుకు తెలిపారు. ఈనెల 31 నుంచి పాఠశాలలు తెరవనున్నారా అని ధర్మాసనం ఆరా తీసింది. కళాశాలలు మూసివేసి.. పాఠశాలలు మాత్రం తెరవాలనుకోవడమేంటని ప్రశ్నించింది. బడుల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

నివేదిక సమర్పించండి

వచ్చే నెలలో జరగనున్న సమ్మక్క, సారక్క జాతరకు లక్షల మంది హాజరు కానున్నారని.. ఆ సమయంలో కరోనా వ్యాప్తి జరగకుండా చర్యలు తీసుకోవాలని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోరారు. గతంలో కుంభమేళా సమయంలో కరోనా విస్తృతంగా వ్యాప్తి జరిగిందన్నారు. స్పందించిన హైకోర్టు... సమ్మక్క, సారక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వారాంతపు సంతలు వ్యాప్తి కేంద్రాలుగా

వీధుల్లో జరిగే వారాంతపు సంతల్లో జనం గుమిగూడుతున్నారని.. కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారాయని న్యాయవాది మయూర్ కుమార్ పేర్కొన్నారు. సంతల్లో అమ్ముకోకుండా పేద విక్రేతలను అడ్డుకోలేమని.. అయితే మాస్కులు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారాంతపు సంతల్లో కోవిడ్ జాగ్రత్తలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదీ చూడండి:కేంద్రం కీలక నిర్ణయం.. వారు కూడా టీకాకు అర్హులే!

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 28, 2022, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details