కృష్ణా బేసిన్(Krishna Basin) నుంచి ఇతర బేసిన్లకు నీటిని మళ్లించడం కాకుండా బేసిన్‌లోని అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సూచించింది. ‘మొత్తం 811 టీఎంసీలను 2015 నుంచి ఆంధ్రప్రదేశ్ 512, తెలంగాణ 299 టీఎంసీలు (66:34) వినియోగించుకొనేలా బచావత్ ట్రైబ్యునల్(Bachawat Tribunal) తాత్కాలిక ఏర్పాటు చేసింది. దీనిని ప్రస్తుత నీటి సంవత్సరంలో మార్పు చేయాలి’ అని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శికి లేఖ రాశారు.
ముఖ్యాంశాలు ఇలా...
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రైబ్యునల్ 512 టీఎంసీలు కేటాయించడంతోపాటు మిగులు జలాలను వినియోగించుకొనే స్వేచ్ఛ ఇచ్చింది. బచావత్ లేదా బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌లు బేసిన్‌లోని సాగు విస్తీర్ణం, కరవు ప్రాంతం, జనాభా తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని నీటి వాటాను విభజించలేదు.
- 75 శాతం నీటి లభ్యత కింద మాకు 550 టీఎంసీలు కేటాయించాలని బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌ను కోరాం. ఈ అంశం విచారణలో ఉంది.
- మరోవైపు తాత్కాలికంగా ఒక సంవత్సరానికి తెలంగాణ 299, ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు వినియోగించుకోడానికి 2015 జూన్‌లో కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి వద్ద జరిగిన సమావేశంలో తెలంగాణ అంగీకరించింది. ఇది కృష్ణా బోర్డు నిర్వహణకోసం చేసిన ఏర్పాటు తప్ప ఇతర వేదికల ముందు తమకు కేటాయించినట్లుగా క్లెయిమ్ చేసుకోరాదని కూడా నిర్ణయం జరిగింది.
- ఆంధ్రప్రదేశ్ దీనిని ఉల్లంఘించింది. సెక్షన్-89 కింద విచారణ జరుపుతున్న కె.డబ్ల్యు.డి.టి-2 ముందు ఈ అంశాన్ని ఉంచింది.
- అలాగే 2017 నవంబరులో జరిగిన కృష్ణా బోర్డు ఏడో సమావేశంలో చిన్ననీటి వనరుల కింద వినియోగం, పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి మళ్లించే నీరు, ఆవిరయ్యే నీరు కాకుండా తెలంగాణ 34 శాతం, ఆంధ్రప్రదేశ్ 66 శాతం వినియోగించుకొనేలా ఒక సంవత్సరానికి ఒప్పందం జరిగింది.
- 2020 జూన్‌లో జరిగిన కృష్ణా బోర్డు 12వ సమావేశంలో రెండు రాష్ట్రాలు 50 శాతం చొప్పున వినియోగించుకోవాలన్న తెలంగాణ విజ్ఞప్తిపై తదుపరి సమావేశంలో చర్చించాలని బోర్డు నిర్ణయించింది.
- నిర్మాణంలో ఉన్న కొన్ని ప్రాజెక్టులు పూర్తి కావడం, పెరిగిన సాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకొని ప్రస్తుత నీటి సంవత్సరంలోనే 50:50 నిష్పత్తి ప్రకారం వినియోగించుకొనేలా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ఎస్.ఎల్.బి.సి, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు 75 శాతం నీటి లభ్యతలో కేటాయించాలి.
- మిగులు జలాల ఆధారంగా చేపట్టిన తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు కృష్ణా నికర జలాలను ఆంధ్రప్రదేశ్ కోరలేదు. అయినా ఈ ప్రాజెక్టులకు గుత్తగా(ఎన్‌బ్లాక్) కేటాయించిన నీటి నుంచి నికర జలాలను ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తోంది. దీని గురించి తెలంగాణ అనేక సార్లు కృష్ణా బోర్డు, కేంద్ర జల్‌శక్తి దృష్టికి తెచ్చింది. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి(CM KCR) ఆంధ్రప్రదేశ్ నీటి మళ్లింపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కూడా. ఈ నేపథ్యంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో 50:50 నిష్పత్తిలో వినియోగించుకొనేలా నిర్ణయం తీసుకోవాలి.