రుణమాఫి ఇతరత్రా చెల్లింపులకు... రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం రూ.20 వేల కోట్లు Telangana Non-tax income generation Plans :ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెండింగ్‌లో ఉన్న కార్యక్రమాల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఏకంగా రూ.19 వేల కోట్ల మేర రుణమాఫీ చెల్లింపులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆర్టీసీ ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని నిర్ణయించింది. ఇందుకోసం నేడో, రేపో శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టనుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు కూడా సిద్ధమైన సర్కార్.. వారికి మధ్యంతర భృతిని కూడా ప్రకటిస్తారని సమాచారం.
Telangana Assembly Elections 2023 : దళితబంధు,బీసీ చేతివృత్తుల వారికి ఆర్థికసాయం, గృహలక్ష్మి, తదితర పథకాలతో పాటు.. ఇతర అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా నిధులు అవసరం. పన్నుల రూపంలో వచ్చే ఆదాయం వేతనాలు, పెన్షన్లు, ఆసరా సహా ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు. దీంతో పెండింగ్‌లో ఉన్నా, అమలు చేయాల్సి ఉన్న కార్యక్రమాల కోసం ఎక్కువగా పన్నేతర ఆదాయంపై ఆధారపడింది. ఆగస్టు నెలలోనే రూ.20 వేల కోట్ల వరకు పన్నేతర ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. పురపాలక, రెవెన్యూ, పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖల ద్వారా ఈ ఆదాయాన్ని సమకూర్చుకోనున్నారు. ఈ దిశగా ఇప్పటికే ఆయా శాఖలకు లక్ష్యాన్ని నిర్ధేశించారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును టోల్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్- టీవోటీ విధానంలో లీజుకు ఇచ్చారు. ఓఆర్ఆర్ నుంచి రూ.7,380 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కోకాపేట నియో పోలిస్ లేఅవుట్ రెండో దశ భూముల వేలం ద్వారా.. కనీసం రూ.6000 కోట్లు వస్తాయని అంచనా వేశారు. బుద్వేల్‌లో వంద ఎకరాల భూములను విక్రయించేందుకు ఇటీవల మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అక్కడ సగటున ఎకరా రూ.30 కోట్లు పలికినా మొత్తంగా కనీసం రూ.3000 కోట్లు వస్తాయని అంచనా వేశారు.
మూణ్నెళ్ల ముందే నోటిఫికేషన్: మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం.. మూణ్నెళ్ల ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చింది. మద్యం దుకాణాల లైసెన్సుల దరఖాస్తుల ద్వారా రూ.1300 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేశారు. మొదటి దశ చెల్లింపులు కూడా పూర్తైతే.. మరో రూ.1200 కోట్లు వరకు సమకూరుతాయని భావిస్తున్నారు. పరిశ్రమల శాఖ భూముల విక్రయం, గృహ నిర్మాణ శాఖ భూముల విక్రయం, రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయం, స్థలాల క్రమబద్ధీకరణ సహా ఇతర రూపాల్లో మరికొంత ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా రూ.20 వేల కోట్ల వరకు పన్నేతర ఆదాయం ద్వారా రాబట్టుకోవాలని ప్రభుత్వం సిద్ధమైంది.
ఇవీ చూడండి: