Telangana Government Hike Diet Charges : గురుకులాలతో పాటు సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం, వసతులు అందించేందుకు ప్రస్తుతం ఉన్న డైట్ ఛార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా.. డైట్ ఛార్జీలను పెంచుతూ సీఎం కేసీఆర్ దస్త్రంపై సంతకం చేశారు. ఈ మేరకు పెరిగిన ఛార్జీలు ఈ జులై నెల నుంచే అమల్లోకి రానున్నాయని తెలిపారు.
పెరిగిన డైట్ ఛార్జీలు మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు.. ప్రస్తుతం నెలకు అందిస్తున్న రూ.950 నుంచి రూ.1200లకు ప్రభుత్వం పెంచింది. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు నెలకు డైట్‌ఛార్జీలు.. రూ.1100 నుంచి రూ.1400లకు పెరిగాయి. 11వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు డైట్‌ఛార్జీలు రూ.1500 నుంచి రూ.1875కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Diet Charges Increased in Telangana : ఈ పెరిగిన డైట్ ఛార్జీల ద్వారా ఏడున్నర లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. డైట్ ఛార్జీలు 26 శాతం పెంచడంతో.. ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి అదనంగా రూ.237 కోట్ల భారం పడనుందని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. మరోవైపు.. డైట్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ కృతజ్జతలు తెలిపారు. సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో పలు అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపి.. ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.