తెలంగాణ

telangana

By

Published : Feb 3, 2023, 9:32 AM IST

ETV Bharat / state

‘గాలేరు-నగరి’పై తెలంగాణ అభ్యంతరం.. కృష్ణా బోర్డుకు లేఖలు

TS Letter to Krishna Board: గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగు గంగ ప్రాజెక్టులపై అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం పనులు చేపడుతోందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఇదే అంశంపై కేఆర్ఎంబీ ఛైర్మన్​కు నీటిపారుదల శాఖ ఈఎన్​సీ మురళీధర్ లేఖలు రాశారు.

Krishna Board
Krishna Board

TS Letter to Krishna Board: గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగు గంగ ప్రాజెక్టులపై అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం పనులు చేపడుతోందని, వాటిని నిలువరించాలని తెలంగాణ నీటిపారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ) సి.మురళీధర్‌ కృష్ణా బోర్డును కోరారు. ఈ మేరకు ఆయన బోర్డు ఛైర్మన్‌కు తాజాగా రెండు లేఖలు రాశారు. గత నెల 23వ తేదీన ఈ పనులకు ఏపీ సర్కారు టెండర్లు కూడా పిలిచిందని పేర్కొంటూ..మరింత ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేఖల్లోని ముఖ్యాంశాలిలా..

‘గాలేరు-నగరి సుజల స్రవంతి ప్యాకేజీ-2లో భాగంగా ప్రధాన కాలువ మట్టి పనులతోపాటు వామికొండ సాగర్‌ జలాశయం, నరెడ్డి శివరామిరెడ్డి (సర్వరాయ సాగర్‌) జలాశయాల కట్టలను బలోపేతం చేసే పనులు, కాలువల నిర్మాణం సహా డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. రూ.130 కోట్ల మేరకు నిధులు కేటాయించింది. ఎస్‌.ఆర్‌.ఎం.సి క్రాస్‌ రెగ్యులేటర్‌, బనకచర్ల, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ల ద్వారా 34 టీఎంసీలు తీసుకునేందుకే ఏపీకి అనుమతి ఉంది. వాటిలో 19 టీఎంసీలు ఎస్‌.ఆర్‌.ఎం.సి, 15 టీఎంసీలు చెన్నై నగర తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంది. కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రాజెక్టులకు మాత్రమే నీటిని వినియోగించుకోవాలని కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ-1) సూచించింది. ఏపీ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. పోతిరెడ్డిపాడు ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని మాత్రమే తరలించాల్సి ఉండగా, దాని సామర్థ్యాన్ని 2006లో 44 వేల క్యూసెక్కులకు విస్తరించారు. ఆ తరువాత 88 వేల క్యూసెక్కులకు విస్తరించే పనులు చేపట్టారు. బనకచర్ల వద్ద గాలేరు-నగరికి 22 వేల క్యూసెక్కులు తరలించేందుకు వీలుగా అదనపు రెగ్యులేటర్‌ నిర్మించారు. కేడబ్ల్యూడీటీ-2 ముందు సెక్షన్‌ 89 నిబంధనల ప్రకారం గాలేరు-నగరి ప్రాజెక్టుకు నీళ్లు కావాలని ఏపీ అప్పీలు చేసుకోలేదు. అయినా మరోమారు ఆ రాష్ట్రం ఈ ప్రాజెక్టు కింద విస్తరణ పనులకు టెండర్లు పిలిచింది. ఈ దశలోనే వాటిని నిలిపివేసేలా చర్యలు చేపట్టండి.

రెండు చెరువులు నింపేందుకు ఎత్తిపోతల నిర్మాణాలు:తెలుగు గంగ ప్రాజెక్టు ప్రధాన కాలువపై రెండు ఎత్తిపోతల నిర్మాణాలను ఏపీ చేపడుతోంది. ప్రధాన కాలువ 120.95 కిలోమీటరు వద్ద ఎత్తిపోతలు నిర్మించి మైదుకూరు మండలంలోని ముదిరెడ్డిపల్లి చెరువు నింపేందుకు వీలుగా 12.50 ఎంసీఎఫ్‌టీ నీటిని తరలించనున్నారు. అలాగే ప్రధాన కాలువపై 120.92 కిలోమీటర్ల వద్ద ఎత్తిపోతలు నిర్మించి తిప్పిరెడ్డిపల్లి చెరువు (గోడేరు చెరువు) నింపనున్నారు. ఈ పనులన్నీ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధం. ఏపీ చేపడుతున్న ఈ విస్తరణ పనులతో తెలంగాణలోని కృష్ణా పరీవాహకంలో ఉన్న ఆయకట్టుకు, కరవు, ఫ్లోరైడ్‌ ప్రాంతాలకు, హైదరాబాద్‌ నగర తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా ఏపీ చేపడుతున్న అదనపు పనులను వెంటనే నిలిపివేసేలా కృష్ణా బోర్డు చర్యలు తీసుకోవాలి’ అని ఈఎన్‌సీ లేఖలో పేర్కొన్నారు.

అనుమతులు లేని ప్రాజెక్టులకు పీఎంకేఎస్‌వైలో చేర్చొద్దు:ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న అనుమతులులేని పలు ప్రాజెక్టులను ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన పథకంలో (పీఎంకేఎస్‌వై) చేర్చే అంశాన్ని కేంద్రం పరిశీలనలోకి తీసుకోవడం సరైన చర్య కాదని తెలంగాణ పేర్కొంది. ఈ ప్రాజెక్టులపై ఈ నెల 6వ తేదీన నీతి అయోగ్‌ సమావేశం నిర్వహిస్తుండటం ఆమోదనీయం కాదంటూ ఈఎన్‌సీ సి.మురళీధర్‌ నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడికి తాజాగా లేఖ రాశారు. కృష్ణా పరీవాహకంలో శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తరలించే రాయలసీమ ఎత్తిపోతల పథకం, గోదావరి పరీవాహకంలో గోదావరి-పెన్నా అనుసంధాన ప్రాజెక్టు, పోలవరం దిగువన గోదావరి ఎడమ గట్టు నుంచి నీటిని తరలించేందుకు చేపడుతున్న ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని లేఖలో గుర్తుచేశారు. మిగులు జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టులను చేపడుతున్నట్టు ఏపీ సర్కారు చెబుతున్నప్పటికీ, మున్ముందు హక్కులు కోరే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరమేలేదన్నారు.

ఇవీ చదవండి:తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు విశ్వనాథ్ ఉంటారు : సీఎం కేసీఆర్

'విద్వేష ప్రసంగాలపై చర్యలు తీసుకోరా?'.. సుప్రీం తీవ్ర ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details