శాసనసభలో రెవెన్యూ బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం - రెవెన్యూ బిల్లులను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
11:01 September 09
శాసనసభలో రెవెన్యూ బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం
రెవెన్యూ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. భూమిపై హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం 2020 బిల్లులను సభ ముందుకు తెచ్చింది. గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు చట్టం 2020 బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కొత్త రెవెన్యూ చట్టం ఏర్పాటుతో పాటు పాత చట్టం రద్దుకు నిర్ణయించింది.
గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు చట్టం 2020 బిల్లు ఆమోదంతో గ్రామ రెవెన్యూ అధికారుల పదవులు రద్దు కానున్నాయి. వీఆర్వోగా పనిచేస్తున్న వ్యక్తి సేవలను ఇతర శాఖల్లోకి బదిలీ చేస్తారు. ఇతర శాఖల్లో విలీనం ఇష్టం లేకుంటే వీఆర్ఎస్ తీసుకోవచ్చు... లేదంటే రాజీనామా చేయవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూమిపై హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం 2020 బిల్లులు ఆమోదం పొందగానే.. ధరణి పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా భూయాజమాన్య హక్కుల బదిలీకి అవకాశం లభిస్తుంది. పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో భూరికార్డులు నిర్వహిస్తారు.
భూమి హక్కుపత్రం, పట్టాదారు పాస్‌పుస్తకం ఏకీకృతం అవుతాయి. ఆస్తి బదిలీ అనంతరం ఆన్‌లైన్ విధానంలో హక్కులు లభిస్తాయి. భూలావాదేవీలకు వెబ్‌సైట్ ద్వారా స్లాట్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సబ్‌రిజిస్ట్రార్ ఇచ్చిన సమయానికి పత్రాలు ఇచ్చి సేవలు పొందవచ్చు. భూములను మార్ట్‌గేజ్ చేస్తే ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేయాలనే అంశాలను ప్రభుత్వం బిల్లులో పొందుపరిచింది. కొత్త చట్టం ప్రకారం రెవెన్యూ కోర్టుల స్థానంలో ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తారు. భూహక్కుల రికార్డుల్లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. సంబంధిత అధికారులను సర్వీసు నుంచి తొలగిస్తారు. పాస్‌పుస్తకం ప్రతి లేకుండానే ఎలక్ర్టానిక్ విధానంలో రైతులకు రుణాలు మంజూరు చేస్తారు. కేంద్ర, రాష్ట్రాల భూములకు చట్టంలోని అంశాలు వర్తించవని ప్రభుత్వం బిల్లులో స్పష్టం చేసింది. కొత్త చట్టం అమలులోకి రాగానే 1971 భూహక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం రద్దు కానుంది. భూముల వివాదాలపై ట్రైబ్యునళ్ల తీర్పే తుది నిర్ణయం కానుంది. ఆస్తిపన్ను, విద్యుత్, నీటి బకాయిలు చెల్లిస్తేనే స్థలాల యాజమాన్య హక్కులు బదిలీ కానున్నాయి. ఈ మేరకు నిర్ణయాన్ని పురపాలకశాఖ తప్పనిసరి చేసింది.
- ఇదీ చూడండి: శాసనసభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం