Revenue Of Commercial Taxes Department: వాణిజ్య పన్నులశాఖ ఆదాయపెంపు మార్గాలపై సర్కార్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో 12 వాణిజ్య పన్నుల శాఖ సర్కిళ్లు ఉన్నా అత్యధిక రాబడి హైదరాబాద్, రాజధానితో ముడిపడి ఉన్న డివిజన్ల నుంచే వస్తోంది. ఆయాడివిజన్ల నుంచి వాస్తవంగా రావాల్సినంత రావట్లేదని ఉన్నతాధికారులు గుర్తించారు. ప్రధానంగా హైదరాబాద్‌లోని అబిడ్స్, చార్మినార్ హైదరాబాద్ గ్రామీణ, పంజాగుట్ట డివిజన్లతోపాటు రాష్ట్ర సరిహద్దులు కలిగి ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్ డివిజన్ల నుంచి వసూళ్లు బాగా తగ్గుతున్నాయని తేల్చారు.
అంతర్రాష్ట్ర సరకు రవాణాపై నిఘా ఉండట్లేదని బాధ్యులైన అధికారులు ఉదాసీనంగా ఉండటం వల్ల రాష్ట్ర ఖజానాకు చిల్లుపడుతోందని నిర్ధారణకు వచ్చారు. ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా జీరోవ్యాపారం జోరుగా సాగుతోంది, ఇతరరాష్ట్రాల నుంచి తీసుకొస్తున్న సరకులను పన్ను చెల్లించకుండానే విక్రయిస్తుండటమే ఈ పరిస్థితికి కారణమనే అంచనాకు వచ్చారు. ముఖ్యంగా స్టీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాల్లో భారీగా పన్ను ఎగవేత జరుగుతోందని తేల్చారు. నిఘా పెంపుతో పాటు అమ్మకాలపైనా ప్రత్యేక దృష్టిసారించాలని నిర్ణయానికి వచ్చారు.
పన్ను ఎగవేతదారులపై ప్రత్యేక నిఘా: పన్ను వసూళ్లు తక్కువగా ఉన్న డివిజన్లలో ఉన్నతాధికారులను బాధ్యులను చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. రూపంలో రాష్ట్రానికి రావాల్సిన మొత్తం వచ్చేలా చూడటంతోపాటు, పన్ను ఎగవేతదారులపై ప్రత్యేక నిఘావంటి అంశాలకు వాణిజ్య పన్నుల శాఖ పదునుపెడుతోంది. వాణిజ్య పన్నులశాఖలో మొండి బకాయిల వసూలుకు ఇప్పటికే వన్‌టైం సెటిల్‌మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. వెయ్యి కోట్ల రాబడి లక్ష్యంగా ఆ కార్యక్రమం చేపట్టారు. కొన్ని సంస్థలు చెల్లింపులకు ముందుకొచ్చినా చివరికి చేతులెత్తేశాయి.