Telangana Liquor shops license notification : మద్యం దుకాణాల లైసెన్సీల జారీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం పాలసీలో ఏలాంటి మార్పు లేదు. పాత విధానం ద్వారానే మద్యం దుకాణాల లైసెన్సీలు జారీకి ఉత్తర్వులు ఇచ్చింది. దరఖాస్తు రుసుంలోకాని, లైసెన్స్ ఫీజులోకాని ఏలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. మద్యం దుకాణాల సంఖ్యలో కూడా ఏలాంటి మార్పు లేదు. ఇప్పుడున్న 2,620 మద్యం దుకాణాలకు లైసెన్సీల ఎంపిక ప్రక్రియ మొదలు కానుంది. ఈనెల 3వ తేదీన అబ్కారీ శాఖ జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ఈనెల 4వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలై 18వ తేదీ వరకు కొనసాగుతుందని అబ్కారీ శాఖ తెలిపింది. ఈనెల 21వ తేదీన జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో డ్రా ద్వారా లైసెన్స్‌ల ఎంపిక కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న మద్యం లైసెన్స్‌ల గడువు ఈ ఏడాది నవంబరు 30వ తేదీ వరకు ఉంది. ఈ నెలలో మద్యం లైసెన్స్‌ల ఎంపిక ప్రక్రియ పూర్తి అయినప్పటికీ.. వీరి లైసెన్స్‌లు ఈ ఏడాది డిసెంబరు ఒకటో తేదీ నుంచి చెల్లుబాటు అవుతాయని అబ్కారీ శాఖ స్పష్టం చేసింది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి లైసెన్స్‌లు తమకు నిర్దేశించిన ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటుకు అవకాశం ఉంటుందని వివరించింది. ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ ప్రకారం గౌడ్లకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం లెక్కన మొత్తం 2620 మద్యం దుకాణాలల్లో 30శాతం అంటే 786 దుకాణాలు రిజర్వేషన్ల ప్రకారం లైసెన్సీలను ఎంపిక చేయాల్సి ఉంది. ఎస్సీలకు 262, ఎస్టీలకు 131, గౌడ్లకు 393 లెక్కన మొత్తం 786 దుకాణాలు రిజర్వేషన్ల కింద పోగా మిగిలిన 1834 దుకాణాలు మాత్రమే ఓపెన్ క్యాటగిరి కింద కేటాయింపు ఉంటుందని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.
Liquor shops license notification details : కొత్తగా పొందే లైసెన్స్‌లు రెండు సంవత్సరాల పాటు అంటే 2025 నవంబరు వరకు చెల్లుబాటవుతాయి. జనాభా ఆధారం చేసుకుని మొత్తం ఆరు స్లాబుల్లో అబ్కారీ శాఖ లైసెన్స్‌లు జారీ చేయనుంది. ఐదు వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ.50లక్షలు, ఐదు వేల నుంచి నుంచి యాభైవేలు జనాభా కలిగిన ప్రాంతాలల్లో లైసెన్స్ ఫీజు రూ.55లక్షలు, 50వేల నుంచి లక్ష వరకు జనాభా కలిగిన ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ.60లక్షలు, లక్ష నుంచి అయిదు లక్షల వరకు జనాభా కలిగిన పట్టణాల్లో లైసెన్స్ ఫీజు రూ.65లక్షలు, అయిదు లక్షల నుంచి 20 లక్షల వరకు జనాభా కలిగిన చోట్ల లైసెన్స్ ఫీజు రూ.85లక్షలు, 20 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో రూ. కోటి పది లక్షలు లైసెన్స్ ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది.
Liquor Income to Telangana Government : గత నోటిఫికేషన్ వివరాలు ప్రకారం.. తిరిగి ఇవ్వని దరఖాస్తు ఫీజు కింద రూ.1350 కోట్లు, దుకాణాల లైసెన్స్ ఫీజు కింద దాదాపు రూ.3500 కోట్లు ప్రభుత్వానికి ఆదాయంగా సమకూరింది. ఈసారి అంతే మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ముందుగానే లైసెన్సులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి.. డిసెంబర్ 1వ తేదీ నుంచి లైసెన్సులు చెల్లుబాటు కానున్నాయి.
మరోవైపు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం ధరలు 20 నుంచి 30శాతం వరకు అధికంగా ఉండటంతో.. ఇతర రాష్ట్రాల నుంచి కొందరు మద్యం అనధికారికంగా తీసుకొస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీని ప్రభావంతో మద్యం విక్రయాలు పడిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో చెక్‌పోస్టుల వద్ద క్షుణ్నంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చదవండి: