ts government jobs : రాష్ట్రపతి నూతన నిబంధనల ప్రకారం జిల్లా, జోనల్, మల్టీజోనల్ ఉద్యోగుల కేటాయింపు త్వరలోనే పూర్తికానున్న నేపథ్యంలో ఆయా విభాగాల్లో ఏర్పడే ఖాళీలను సంబంధిత విభాగాలు త్వరలోనే గుర్తించనున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రోస్టర్ పట్టిక కీలకం. 1-100 వరకు పాయింట్లను రిజర్వేషన్ల వారీగా గుర్తించారు. ఇందులో భాగంగా గుర్తించిన ఖాళీలను రోస్టర్ పాయింట్ మేరకు (జనరల్, మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వారీగా కేటాయించి) రిజర్వు చేసి ఉద్యోగ ప్రకటనలు వెలువరించడం ఆనవాయితీగా వస్తోంది. తదుపరి ప్రకటన నాటికి గుర్తించిన ఖాళీలకు గతంలో ముగిసిన పాయింట్ నుంచి వరుస క్రమంలో తీసుకుని పోస్టులు రిజర్వు చేస్తూ వస్తున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఉమ్మడి రాష్ట్ర రోస్టర్ ముగించి, కొత్తగా గుర్తించిన ఖాళీల భర్తీకి కొత్త రోస్టర్ అమల్లోకి తెచ్చారు. తొలి పాయింట్ నుంచి లెక్కించారు.
తాజాగా రాష్ట్రపతి నూతన ఉత్తర్వులతో 10 జిల్లాలు 33 జిల్లాలుగా మారాయి. 7 జోన్లు, 2 మల్టీజోన్లు వచ్చాయి. ఈ కారణంగా పలు పోస్టుల కేటగిరీ స్థాయి మారిపోయింది. నూతన ఉత్తర్వుల ప్రకారం పలు విభాగాల్లోని జిల్లా స్థాయి పోస్టులు జోనల్‌గా, జోనల్‌వి మల్టీ జోనల్‌గా, జిల్లా స్థాయిగా మారాయి. రాష్ట్రస్థాయి పోస్టులు మల్టీజోనల్ కిందకు వచ్చాయి. పలు పోస్టుల కేటగిరీల్లో భారీ మార్పులు చోటుచేసుకోవడం, జిల్లాల సంఖ్య పెరగడం, కొత్త జోన్లు, మల్టీజోన్ల నేపథ్యంలో కొత్తగా గుర్తించే ఖాళీల భర్తీకి కొత్త రోస్టర్ పాటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.