హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) నిధుల కొరతతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా మరోవైపు కేంద్రం కేటాయించిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విడుదల చేయడం లేదు. రోడ్ల నిర్మాణంతోపాటు వివిధ రకాల అభివృద్ధి పనులు చేసిన గుత్తేదారులకు సకాలంలో నిధులు చెల్లించలేకపోవడంతో ఇప్పటికే రెండుసార్లు పనులను నిలిపివేశారు. రుణ సేకరణ ద్వారా చేపట్టిన వంతెనలు ఇతరత్రా అభివృద్ధి పనులు మాత్రమే జరుగుతున్నాయి. బల్దియా నిధులతో చేపట్టాల్సిన పనులు మాత్రం ఎక్కడికక్కడే నిల్చిపోయాయి.
ఆస్తి పన్ను వసూలైతేనే ఉద్యోగులు, జీతాలు చెల్లించే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఇంతదారుణంగా ఉంటే ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కేటాయించడం లేదని సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాధానంలో బల్దియా అధికారులు స్పష్టం చేశారు. సీపీఎం నగర కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే దీనికి సంబంధించి వివరాలను అధికారులు లిఖితపూర్వకంగా వెల్లడించారు.