తెలంగాణ

telangana

ETV Bharat / state

దసరా నుంచి ధరణి పోర్టల్‌ ప్రారంభం...

ధరణి పోర్టల్‌ను దసరా రోజున ప్రారంభించాలని ప్రభుత్వ నిర్ణయం
ధరణి పోర్టల్‌ను దసరా రోజున ప్రారంభించాలని ప్రభుత్వ నిర్ణయం

By

Published : Sep 26, 2020, 6:41 PM IST

Updated : Sep 26, 2020, 8:30 PM IST

18:40 September 26

దసరా నుంచి ధరణి పోర్టల్‌ ప్రారంభం...

    కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్ దసరా పండుగ రోజు ప్రారంభం కానుంది. ప్రజలు మంచి ముహూర్తంగా భావించే విజయదశమి రోజున పోర్టల్​ను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సీఎం స్వయంగా ధరణి పోర్టల్​ను ప్రారంభిస్తారు.  అందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలను ఈలోగా పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ధరణి పోర్టల్​కు అవసరమైన సాఫ్ట్​వేర్, హార్డ్​వేర్, బ్యాండ్ విడ్త్​లను సిద్ధం చేయాలన్నారు. 

    మారిన రిజిస్ట్రేషన్ విధానం, వెంటనే మ్యుటేషన్, ధరణి పోర్టల్​కు వివరాలను అప్ డేట్ చేయడం తదితర అంశాలు విధివిధానాలపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. నమూనా ట్రయల్స్ కూడా నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించనున్నారు. 

మండలానికి ఒకరు చొప్పున..

    ప్రతి మండలానికి ఒకరు చొప్పున, ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్ల నియామకాన్ని పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ధరణి పోర్టల్ ప్రారంభానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నంబర్ల వారిగా రిజిస్ట్రేషన్ ధరలను నిర్ణయిస్తామన్న సీఎం.. వాటి ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని చెప్పారు. తహసీల్దార్ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్స్​కు లైసెన్సులతో పాటు శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. 

ఆ రోజు నుంచే రిజిస్ట్రేషన్లు..

    దసరాలోగానే అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్​లో నమోదు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆ తర్వాత జరిగే మార్పులు, చేర్పులు వెంటవెంటనే నమోదవుతాయని చెప్పారు. దసరా రోజున ధరణి పోర్టల్​ను ప్రారంభిస్తున్నందున ఆ రోజు నుంచే రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. అంతవరకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ వ్యవహారాలు జరగబోవని సీఎం స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:ఆ రెండు రాష్ట్రాలకు బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్​

Last Updated : Sep 26, 2020, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details