కరోనా, లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన మొత్తాన్ని నాలుగు నెలల్లో చెల్లించనున్నారు. పింఛనుదారులకు మాత్రం రెండు మాసాల్లోనే జమచేయనున్నారు. ఈ మేరకు బకాయిల చెల్లింపు విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
కొవిడ్ కారణంగా లాక్డౌన్ విధించడం వల్ల ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది.. వేతనాలు, పింఛనుల్లో రాష్ట్ర ప్రభుత్వం కోత విధించింది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వేతనాలు, పింఛను చెల్లింపుల్లో కోత పెట్టింది. ఆ తర్వాత నుంచి పూర్తి వేతనాలు ఇస్తున్నారు.
బకాయిల చెల్లింపునకు సంబంధించి స్పష్టతనిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పింఛన్లో కోత విధించిన మొత్తాన్ని అక్టోబర్, నవంబర్ నెలల్లో చెల్లించనున్నట్లు తెలిపింది.
అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత విధించిన మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించనున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్తోపాటు వచ్చే ఏడాది జనవరి నెలల్లో బకాయిలను చెల్లించనున్నారు.
ప్రభుత్వ రంగ, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, గౌరవవేతనాలనూ ఇదే తరహాలో చెల్లించనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీచూడండి:ఆ సంస్థ ఉద్యోగులకు 6 నెలలు జీతాల్లో కోత