నెలాఖరు లోపు వంద శాతం లక్ష్యాన్ని నిర్ధేశించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించి మార్గనిర్ధేశం చేసింది. దానికి కొనసాగింపుగా ఉన్నతాధికారులు జిల్లాల బాట పట్టనున్నారు. టీకాల విషయంలో వెనకంజలో ఉన్న జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వ్యాక్సినేషన్ శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
దీంతో రెండు ఉమ్మడి జిల్లాల్లో ఇవాళ ఉన్నతాధికారులు పర్యటించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య-ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, అధికారులతో కూడిన బృందం ఇవాళ ఆదిలాబాద్, మహబూబ్ నగర్లో పర్యటించనుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య అధికారులతో సమావేశమవుతారు. వ్యాక్సినేషన్ పరిస్థితిపై సమీక్షించి వందశాతం లక్ష్యాన్ని చేరుకునేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. జిల్లా స్థాయి అధికారులకు దిశానిర్ధేశం చేస్తారు. టీకాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే విషయమై ప్రధానంగా దృష్టి సారిస్తారు. వ్యాక్సినేషన్‌తో పాటు ఇతర కొవిడ్ నియంత్రణా చర్యలు, ఇతర అంశాలపై కూడా చర్చిస్తారు.