Decade celebrations of Telangana : నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర పాలనకు అనుగుణంగా.. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఎన్నో సంస్కరణల్ని తీసుకొచ్చింది సీఎం కేసీఆర్ సర్కారు. ప్రజలకు పాలనను దగ్గర చేసేలా.. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరేలా నూతన సంస్కరణలు చేశారు. అందులో మొదట చెప్పుకోవాల్సింది.. జిల్లాల పునర్విభజన. 10జిల్లాలతో ఏర్పడిన తెలంగాణను 33 జిల్లాల్లుగా విభజించారు. రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. కొత్త పాలనా కేంద్రాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగాయి. ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, కార్యాలయాలు, పాలనా భవనాలు పెరిగాయి. ఫలితంగా ఆ ప్రాంతాల స్వరూపం మారిపోయింది.
Telangana Development in 9 Years : 2014 నుంచి క్రమంగా అభివృద్ధి బాటపట్టిన తెలంగాణ రాష్ట్రంలో పంటపొలాలు, స్థిరాస్తిల విలువలు భారీగా పెరిగాయి. భూరికార్డుల సమగ్ర నిర్వహణ కోసం ధరణి పోర్టల్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నా.. అన్నీ సక్రమంగా ఉన్న వారి భూ లావాదేవీలు సాఫీగా సాగే వెసులుబాటు కలిగింది. పచ్చదనం పెంపే లక్ష్యంగా తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 273 కోట్ల మొక్కలు నాటింది. ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం 7% పైగా పెరిగింది. తొమ్మిదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ పురోగమించిందనే గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల అభివృద్ధి సూచికలుగా ప్రకటించే పలు అవార్డులు ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. స్థూల దేశీయ జాతీయ ఉత్పత్తి, తలసరి ఆదాయం సహా అన్నింటా గణనీయమైన వృద్ధి సాధించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఆధ్యాత్మికతకూ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. బతుకమ్మ, బోనాల లాంటి పండుగలను ఘనంగా నిర్వహించస్తూ.. చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేస్తోంది. హిందూ, ముస్లిం, క్రైస్తవ ఇలా అన్ని మతాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తుంది. పర్యాటకం విషయంలోనూ ప్రభుత్వం దృష్టి సారించింది. చారిత్రక, ప్రముఖ ప్రాంతాలకు పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటోంది. మొత్తంగా తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం సరైన దిశగానే సాగిందని విశ్లేషకులు అంటున్నారు.