రాష్ట్ర బడ్జెట్ కసరత్తు షురూ చేసిన ఆర్థిక శాఖ Telangana Budget 2023-24 : ప్రస్తుత ఆర్థికసంవత్సరం చివరి త్రైమాసికం ప్రారంభం కావడంతో వచ్చేఆర్థిక సంవత్సరానికి చెందిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ తయారీ కసరత్తును ప్రభుత్వం ఆరంభించింది. బడ్జెట్ కసరత్తు ప్రారంభంలో భాగంగా ఆర్థికశాఖ అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana Budget plan : 2023-24 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం ప్రతిపాదనలు సమర్పించాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ తెలిపింది. వాటితోపాటు ప్రస్తుతం కొనసాగుతున్న 2022 -23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు చెందిన సవరించిన ప్రతిపాదనలు ఇవ్వాలని తెలిపింది. సవరించిన ప్రతిపాదనల్లో కేటాయింపుల మొత్తాన్ని పెంచే అంశాన్ని అంగీకరించేది లేదని ఆర్థికశాఖ స్పష్టంచేసింది. మధ్యలో కొత్తపథకాలు లేదాకార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ తేదీ వివరాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అందుకయ్యే మొత్తం వ్యయం, సంబంధిత వివరాలు సమర్పించాలని తెలిపింది.
Telangana Budget plan 2023-24 : పబ్లిక్‌వర్క్స్ పనులు చేసే అన్నిశాఖలు 2022 డిసెంబర్ వరకు చేయాల్సిన చెల్లింపు మొత్తాల వివరాలివ్వాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. వివరాలు అందించే క్రమంలో ఖచ్చితత్వం ఉండాలని పేర్కొంది. ఇంజనీరింగ్ పనులకు చెందిన అన్ని ఒప్పందాల వివరాలు సమర్పించాలని సూచించింది. ప్రస్తుతం అమలులో ఉన్న పన్నులు, ధరలఆధారంగా వచ్చే ఆర్థిక సంవత్సరం ఆదాయాన్ని అంచనావేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆర్థికశాఖ సూచించింది.
రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆయాశాఖలో అమలు చేసే కార్యక్రమాలు, పథకాలు, నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు ఇవ్వాలన్న ఆర్థికశాఖ ఊహాజనితంగా ఉండరాదని స్పష్టం చేసింది. ఇప్పటికే కేటాయించిన పోస్టుల్లో 2023-24 లో కొత్తగా చేరే ఉద్యోగుల సంఖ్య, ఖాళీల వివరాలను నిర్దేశిత నమూనాలో అందించాలని సూచించింది.
అన్ని శాఖల వద్ద ఉన్న బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమగ్ర వివరాలివ్వాలని తెలిపింది. అన్ని వివరాలతో కూడిన ప్రతిపాదనలు ఆన్‌లైన్‌లో ఈ నెల 12 వరకు సచివాలయంలోని సంబంధితశాఖలకు అందించాలనిఆర్థికశాఖ పేర్కొంది సచివాలయంలోని సదరుశాఖల పాలన యంత్రాంగం ఆ ప్రతిపాదనలను పరిశీలించి తమ అభిప్రాయాలను పొందుపరిచి 13వ లోగా ఆర్థికశాఖకు అందించాలని స్పష్టంచేసింది. శాఖలన్నీ తమ పరిధిలో రెవిన్యూ రాబడులు పెంచుకునే అంశంపై దృష్టిపెట్టాలని ఎక్కడా లీకేజీలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ సూచించింది. అన్ని స్థాయిల ఉద్యోగుల పనితీరు మెరుగుపడేలా వ్యక్తిగత ప్రమాణాలను నిర్దేశించాలని పేర్కొంది.