Dharani Portal Modules: భూ యాజమాన్య హక్కులు అందని రైతులు ధరణి పోర్టల్లో మాడ్యూళ్ల ఏర్పాటుకు ఎదురుచూస్తున్నారు. రైతుబంధు, బీమా పథకాలు వర్తించాలంటే ధరణి పోర్టల్లో భూ సమాచారం ఉండాలి. ఇప్పటికీ సమస్యలు అపరిష్కృతంగా ఉన్న రైతులకు సంబంధించి కొత్త మాడ్యూళ్ల్లు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. దాదాపు మూడున్నర లక్షల మంది వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. 11 లక్షల ఎకరాల సమాచారం పోర్టల్లో నిక్షిప్తం కావాల్సి ఉందని అంచనా. ధరణి సమస్యలపై మంత్రి వర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం కొత్త మాడ్యూళ్లు అందుబాటులోకి రావాల్సి ఉంది.
విస్తీర్ణాలలో కోతల సమస్య...
పరిష్కరించాల్సిన సమస్యల్లో ప్రధానంగా భూ విస్తీర్ణాలలో కోతలు పడినవి ఉన్నాయి. ఉన్న భూమి కంటే తక్కువ భూమిని ధరణిలో ఎక్కించారు. రైతుకు ఉన్న భూమిలో కొంత విస్తీర్ణం కోతకు గురికాగా.. పాసుపుస్తకంలోనూ తక్కువ విస్తీర్ణమే నమోదు చేశారు. దీంతో రైతుబంధు కూడా తక్కువ మొత్తం వస్తోంది. కొన్ని జిల్లాల్లో ఆర్‌ఎస్‌ఆర్ సమస్యలున్నవి ఉండగా, కొన్ని చోట్ల సర్వే నంబర్లలో ప్రభుత్వ భూములు ఉండటంతో నిషేధిత జాబితాలోకి కొంత భూమి వెళ్లి రైతులకు తక్కువగా నమోదైన సంఘటనలు ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటే కొన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయి భూ సర్వే చేయక తప్పని పరిస్థితి ఉంది. ఇలాంటి వారు ఇప్పటికే ధరణి పోర్టల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్ ఐచ్ఛికంలో దరఖాస్తుచేసినా సరైన పరిష్కారం లభించడం లేదని చెబుతున్నారు.