జూన్ తొలివారం గడచిపోయింది. మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించవచ్చనేది వాతావరణశాఖ అంచనా. ఈసారి పత్తి, వరి, కంది పంటలే కోటీ 20లక్షల ఎకరాల్లో వేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మరో 4లక్షల ఎకరాల్లో సోయా సాగుచేయాలని, ఈ విత్తనాలకు రాయితీ ఇస్తామని వ్యవసాయశాఖ తెలిపింది. కానీ అవి మార్కెట్‌లో దొరకడం లేదని రైతులు వాపోతున్నారు.
కంది, సోయా విత్తనాలకు పల్లెల్లో గిరాకీ పెరిగింది. వీటిలో పత్తి, వరి, కంది పంటల విత్తనాలకూ రాయితీలేమీ ఇవ్వడం లేదని రైతులు ప్రైవేటు దుకాణాల్లో కొనేందుకు బారులు తీరుతున్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సైతం పూర్తి ధరలకే విత్తనాలు విక్రయిస్తోంది. రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేయనందున బ్యాంకులు పంటరుణాల పంపిణీని పూర్తిస్థాయిలో మొదలుపెట్టలేదు. ఈ క్రమంలో పంట పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రైతుబంధు సొమ్ము కోసం రైతులు వ్యవసాయాధికారులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.