Telangana Election Counting Arrangements 2023 :శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన వారి భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఈవీఎంలలో(EVM) నిక్షిప్తం చేసిన రెండు కోట్లా 32 లక్షలకు పైగా ఓటర్ల తీర్పు మరికొంత సమయంలో వెలువడనుంది. 2290 మంది అభ్యర్థుల గెలుపోటములు వెల్లడి కానున్నాయి. 119 నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన జరిగిన పోలింగ్‌కు సంబంధించి మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ షూరూ - 10గంటలకు తొలి ఫలితం
ఉదయం ఎనిమిది గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపడతారు. అరగంట తర్వాత ఎనిమిదిన్నరకు ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 2417 రౌండ్లలో ఫలితాలు(Election Result) తేలనున్నాయి. అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 26 రౌండ్లలో లెక్కింపు చేపట్టనుండగా, అత్యల్పంగా భద్రాచలంలో కేవలం 13 రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కోసం 119 నియోజకవర్గాల్లో 1798 టేబుళ్లు ఏర్పాటు చేశారు. గరిష్టంగా మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో లెక్కింపు కోసం 28 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు.
Telangana Elections Counting Centers :పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే, ఈవీఎంలోని ఓట్లతో పాటు సమాంతరంగా లెక్కిస్తారు. చివరి రౌండ్ మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైతేనే చేపడతారు. మొత్తం లెక్కింపు పూర్తయ్యాక ఐదు వీవీప్యాట్ యంత్రాల్లోని(VVPAT Machine) స్లిప్పులను ర్యాండమ్‌గా లెక్కిస్తారు. ఆ తర్వాతే ఫలితాన్ని ప్రకటిస్తారు. మొత్తంగా రాష్ట్రంలో 71.34 ఓటింగ్ శాతం నమోదైంది. నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యధికంగా మునుగోడులో 91.89 శాతం పోలింగ్ జరిగింది. అత్యల్పంగా యాకుత్ పురాలో కేవలం 39.64 శాతం ఓటర్లు మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు.