తెలంగాణలో ఎంసెట్ బైపీసీ కౌన్సెలింగ్ (Ts eamcet Bipc counseling) షెడ్యూల్ విడుదలైంది. డిసెంబరు 1 నుంచి 3 వరకు ఆన్లైన్లో రుసుము చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. డిసెంబరు 3, 4 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన, 3 నుంచి 5 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. డిసెంబరు 7న బీఫార్మసీ, ఫార్మ్ డీ, బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు ఉండనుంది. సీటు పొందిన అభ్యర్థులు డిసెంబరు 7 నుంచి 10 వరకు ఆన్లైన్లో బోధన రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్(Ts eamcet counseling Schedule) చేయాలని ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.
డిసెంబరు 13 నుంచి తుది విడత కౌన్సెలింగ్..
తొలి విడత సీట్ల కేటాయింపులో మిగిలిన సీట్ల కోసం డిసెంబరు 13 నుంచి తుది విడత కౌన్సెలింగ్ (Ts eamcet Bipc counseling Schedule) ప్రక్రియ నిర్వహిస్తామని కమిషనర్ నవీన్ మిత్తల్ పేర్కొన్నారు . డిసెంబరు 13 నుంచే ఆన్లైన్లో కౌన్సెలింగ్ ఫీజు చెల్లించి.. ధ్రువపత్రాల కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. డిసెంబరు 14న ధ్రువపత్రాల పరిశీలన, 13 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లకు వీలు కల్పించామని తెలిపారు. 17న తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. డిసెంబరు 17 నుంచి 19 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి.. 18 నుంచి 20 వరకు కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని నవీన్ మిత్తల్ తెలిపారు. ప్రైవేట్ కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం డిసెంబరు 19న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొన్నారు.