Telangana Decade celebrations Today Special : చరిత్రను అర్థం చేసుకుంటే వర్తమానాన్ని అవగాహన చేసుకుంటూ భవిష్యత్‌కు బాటలు వేసుకోగలమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రను భావితరాలకు తెలియజేసేలా భారత్ జాగృతి సంస్థ ప్రచురించిన తెలంగాణ చరిత్ర పుస్తకం 5 సంపుటాలనుదశాబ్ది ఉత్సవాల్లోభాగంగా సాహిత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రగతి భవన్‌లో సీఎం ఆవిష్కరించారు. దాదాపు 20 కోట్ల సంవత్సరాల నాటి చారిత్రక ఆనవాళ్లు తెలంగాణలో బయటపడటం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమన్న సీఎం ఈ దిశగా చరిత్రకారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
మహోన్నతమైన తెలంగాణ చారిత్రక వారసత్వం కోట్లాది సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పారు. జాతిపిత చెప్పిన గంగా జమున తెహజీబ్ తెలంగాణలో కనిపిస్తోందని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సాహిత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన వేడుకలకు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉర్దూ, తెలంగాణ సాహితీవేత్తలను మంత్రి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కవి సమ్మేళనాలు నిర్వహించి కవులకు, సాహితీవేత్తలకు అవార్డులు అందించనున్నట్లు మంత్రులు తెలిపారు.
- Telangana decade celebrations at T hub : 'టీ హబ్‌ను చూస్తే ప్రభుత్వ ముందుచూపు తెలుస్తుంది'
- Welfare Celebrations in Telangana : 'తెలంగాణ సంక్షేమ పథకాలు.. దేశానికే ఆదర్శంగా నిలిచాయి'
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో స్థానిక ఎమ్మెల్యే సండ్ర నేతృత్వంలో కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర మరవలేనిదని దేవాదాయ, అటవీశాఖల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. నిర్మల్ కలెక్టరేట్‌లో జరిగిన కవి సమ్మేళనానికి మంత్రి హాజరయ్యారు. రాష్ట్రాభివృద్ధిపై ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనం అలరించింది. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కవులు, కళాకారులకు స్వరాష్ట్రంలో సముచిత స్థానం దక్కిందన్న ఇంద్రకరణ్ రెడ్డి.. సాహితీ ప్రియుడైన సీఎం కేసీఆర్ కళారంగానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.