రాష్ట్రంలో అమలు చేయ తలపెట్టిన దళిత సాధికారత పథకానికి ‘తెలంగాణ దళిత బంధు’ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. రైతుబంధు తరహాలోనే ఈ పథకాన్ని కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ముందు నిర్ణయించిన ప్రకారమే రూ.1,200 కోట్లతో తెలంగాణ దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందని, అయితే పైలట్ ప్రాజెక్టు అయినందున హుజూరాబాద్‌కు అదనంగా రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకూ వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడ 20,929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. నిబంధనల మేరకు అర్హులైన వారిని ఎంపిక చేసి.. ఆయా కుటుంబాలకు పరిపూర్ణ స్థాయిలో పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. త్వరలోనే తేదీని ప్రకటిస్తామన్నారు.
గత నెల 27న జరిగిన అఖిలపక్ష సమావేశంలో దళత సాధికారత పథకంపై సీఎం నిర్ణయం తీసుకున్నారు. స్వీయ ఆర్థిక సాధికారత ద్వారా తమ అభివృద్ధిని తామే నిర్వచించుకుని, నిర్ణయించుకునేలా ఒక్కొక్క నిరుపేద కుటుంబానికి యూనిట్ల(పరిశ్రమ/ఇతర వనరులు) ఏర్పాటుకు రూ.పది లక్షల ఆర్థిక సాయం చొప్పున ప్రతి నియోజకవర్గంలోనూ వంద కుటుంబాలకు ఇస్తామని ప్రకటించారు. మొత్తం 119 నియోజకవర్గాలలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. రైతుబంధు మాదిరే సాయాన్ని ఎంపికైన కుటుంబాల పేరిట నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ఆ రోజున తెలియజేశారు. ఈ పథకంపై ఆదివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం తెలంగాణ దళితబంధు పథకం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీవో నంబర్ ఆరును జారీ చేసింది ఎస్సీ అభివృద్ధి శాఖ.
ఆనవాయితీ కొనసాగింపు..
ఆది నుంచి తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిలిచిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రారంభిస్తున్నారు. కరీంనగర్‌లో 2001లో తెలంగాణ సింహగర్జన సభ జరిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్‌లో రైతుబంధు, కరీంనగర్‌లో రైతు బీమా పథకాన్ని ప్రారంభించారు. అదే ఆనవాయితీని కొనసాగించాలని తాజాగా నిర్ణయించారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకం అమలుకు పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సమగ్ర అధ్యయనంతో అర్హుల ఎంపిక..
హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని దళిత కుటుంబాల వివరాల స్థితిగతులపై అధ్యయనం చేసి, నిబంధనల మేరకు ఉద్యోగులు, ఉన్నతస్థాయిలో ఉన్న వారు మినహా ఇతరులను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం నియోజకవర్గంలో...హుజూరాబాద్ గ్రామీణ మండలంలో 5,323 దళిత కుటుంబాలు, కమలాపూర్ మండలంలో 4,346, వీణవంక మండలంలో 3,678, జమ్మికుంట మండలంలో 4,996, ఇల్లంతకుంట మండలంలో 2,586 కుటుంబాలున్నాయని అధికారులు నివేదించారు. పైలట్ ప్రాజెక్టు అమలు కోసం కలెక్టర్లతో పాటు ఎంపిక చేసిన అధికారులు పాల్గొంటారు. వారితో త్వరలోనే వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. దళితులను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చడమే ఈ పథకం లక్ష్యమని.. హుజూరాబాద్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి అనుభవాలను సమీక్షించుకుని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు చేయడం అధికారులకు మరింత సులువవుతుందని ఆయన తెలిపారు.
‘‘తెలంగాణ దళిత బంధు పథకంలో అందించే రూ.పది లక్షల నగదుతో పాటు, లబ్ధిదారుడు ప్రభుత్వ భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తాం. లబ్ధి పొందిన దళిత కుటుంబం ఏ పరిస్థితిలోనైనా ఆపద, ఇబ్బందులకు గురైతే వారిని ఆదుకునేందుకు ఇది ఒక రక్షణ కవచంగా నిలుస్తుంది. దీంతో పాటు పథకం అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఫలితాలను అంచనా వేస్తాం. ఈ పథకంలో కుటుంబం యూనిట్‌గా అర్హులను ఎంపిక చేస్తాం. లబ్ధిదారులు తమకు ఇష్టమైన పనిని ఎంచుకుని అభివృద్ధి చెందే వెసులుబాటు కల్పిస్తాం. ప్రభుత్వాలు తమ అభ్యున్నతిని ఆలోచిస్తున్నాయి అనే విశ్వాసాన్ని, దృఢ నమ్మకాన్ని దళితుల్లో కలిగించాలి. పథకం అమల్లో అధికార యంత్రాంగం అలసత్వం వహిస్తే.. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం సహించబోదు’’ - సీఎం కేసీఆర్.
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎంవో అధికారులు నర్సింగ్‌రావు, స్మితా సభర్వాల్, ఎస్సీల అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు.
నెలాఖరులోపు లేదా ఆగస్టు 15న ప్రారంభం..
ఈ నెలాఖరులోపు లేదా ఆగస్టు 15న ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌లో లేదా కమలాపూర్ మండలంలో పెద్దఎత్తున ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: CM KCR: 'ఎస్సీ సాధికారత సాధించి దేశానికి ఆదర్శంగా నిలుద్దాం'