రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు... పార్టీ వ్యవహారాలు, నేతల తీరు పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో నేడు జరిగిన ముఖ్య నాయకులు సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహం, సీఎఎ, ఎన్‌ఆర్సీ ఆందోళనలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 28న తలపెట్టిన ర్యాలీ తదితర అంశాలపై చర్చించేందుకు నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేత వీహెచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
వీహెచ్ వాకౌట్... ఉత్తమ్ కోపం...
కోర్ కమిటీ అని చెప్పి అందరినీ సమావేశంలో కూర్చోబెట్టారని వీహెచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం మధ్యలో నుంచి వెళ్లిపోయారు. అధికార పార్టీ నుంచి చిన్న నాయకులు తనపై ఆరోపణలు చేస్తుంటే... కాంగ్రెస్ నుంచి ఏ ఒక్కరు ఖండించలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గతంగానూ... కొందరు నేతలు విమర్శలు చేస్తున్నారని, అయినా ఎవరు మాట్లాడడం లేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా తన అసహనాన్ని తెలిపినట్లు సమాచారం.