Telangana Congress Assembly Elections Campaigning Plan :రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ.. ప్రచార కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. వినూత్న రీతిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పీసీసీ.. హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో ప్రజాకోర్టు నిర్వహించింది. ప్రజాకోర్టుకు న్యాయమూర్తిగా కంచె ఐలయ్య వ్యవహరించారు. ఈ కోర్టు వేదికకు రెండు వైపులా బోనులు ఏర్పాటు చేశారు. ఒకవైపు బోనులో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావు కటౌట్లను ఉంచారు. మరోవైపు బోనులోకి హస్తం నేతలు ఒక్కొక్కరుగా వచ్చి ప్రభుత్వం పని తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఛార్జిషీట్ రూపంలో ప్రజాకోర్టు ముందు పెట్టారు. బీసీ ఛార్జిషీట్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, దళిత ఛార్జిషీట్‌పై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మైనారిటీ అంశాలపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ, తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, బీఆర్ఎస్ అవినీతిపై ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గిరిజన అంశంపై మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ తదితరులు... ఛార్జిషీట్‌లను ప్రజాకోర్టుకు వివరించారు.
T-Congress Election Campaign committee :అవినీతి చేయడంలో కేసీఆర్ ఇంట్లో.. కేటీఆర్, కవిత, హరీశ్‌రావు పోటీ పడుతున్నారని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓట్ల కోసం ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేశాడని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ తీరుపై ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం చేతిలో 14 ముఖ్యమైన శాఖలు ఉన్నాయని.. తద్వారా దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చి.. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రసాదించిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రచార సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. టీపీసీసీ ప్రారంభించిన "తిరగబడదాం- తరిమికొడదాం" అనే నినాదంతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు వెల్లడించారు. అప్పటి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆత్మగౌరవం కోసమే ఇచ్చినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
"కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల కంటే.. ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రసాదించింది. ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారు. "తిరగబడదాం- తరిమికొడదాం" అనే నినాదంతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృతంగా ప్రచారం చేయనున్నాం".- రేవంత్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు