Telangana Commercial Tax Department: కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో 2017 జులైలో వస్తుసేవల పన్ను జీఎస్టీని అమల్లోకి తెచ్చింది. ఐదు రకాల శ్లాబుల్లో తెచ్చిన ఈ పన్నులో వసూలైన ప్రతి రూపాయిలో సగం కేంద్రానికి, సగం వినియోగం జరిగే రాష్ట్రాలకు వస్తుంది. మన రాష్ట్రానికి చెందిన వ్యాపార వాణిజ్య సంస్థలు ఇతర రాష్ట్రాలలో కొనుగోలు చేసే సరుకులు, సేవలకు చెంది చెల్లించిన జీఎస్టీని ఆయా సంస్థలు తిరిగి తీసుకునే వెసులుబాటు ఉంది.
లేదంటే ఆ మొత్తాన్ని తన ఖాతాల్లో నిల్వ ఉంచుకుని ఇతర వ్యాపార లావాదేవీలకు వాడుకోవచ్చు. కానీ కొన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు తన నెలవారీ రిటర్న్‌లలో కొనుగోళ్ల వివరాలు చూపించడం లేదు. దీంతో రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా రాకుండా కేంద్రం వద్దనే ఉండిపోతోంది. కేంద్ర ఆర్ధిక శాఖ రెవెన్యూ నివేదికలను అధ్యయనం చేసిన రాష్ట్ర ఎకనామిక్ ఇంటిలిజెన్స్ యూనిట్.. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ వాటా తగ్గిందని గుర్తించింది.
మరింత లోతైన విశ్లేషణ చేయగా.. వేలాది మంది ఇతర రాష్ట్రాల్లో సరుకులు కొనుగోళ్లు, సేవలు వినియోగం చేస్తున్నప్పటికీ.. వాటికి చెందిన నెలవారీ, వార్షిక రిటర్న్‌లలో చూపడం లేదని తేలింది. దీంతో వ్యాపారులు చెల్లించిన జీఎస్టీ తిరిగి తీసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. మరోవైపు రాష్ట్ర ఖజానాకు జమ కావాల్సిన మొత్తం కూడా కాలేదు. ఇలాంటి వ్యాపార వాణిజ్య సంస్థలు ఎన్ని ఉన్నాయని ఆరా తీసిన ఆర్ధిక నిఘా విభాగం.. 36 వేలకుపైగా సంస్థలు ఉన్నట్లు గుర్తించింది.